అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
యువత కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలి
ట్రస్ట్ ద్వారా త్వరలో ఐటీ కంపెనీల్లో ఉద్యోగ మేళా
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సత్యనారాయణ గుప్తా
ఇందూరు, మే7 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావడం కష్టమని, అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేళాలో ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉండేలా చూడాలన్నారు.
చాలామంది యువత రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగాలు చేరడం లేదని, అలాకాకుండా అనుభవం వచ్చేవరకు ఉద్యోగం చేయాలని తెలిపారు. ధన్‌పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కువ శాతం ఐటి కంపెనీలు ఉండేలా చూస్తామన్నారు. అనంతరం ఉద్యోగాలు పొందిన పలువురికి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి మఠం పవన్, వైష్ణవి సుధా, మురళి జ్యోతి, అర్చన చిరంజీవి జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






