8 May, 2026 | 1:57 AM

తెలంగాణలో బీజేపీదే గెలుపు

08-05-2026 12:55 AM
  1. దీనికి శ్రీకారం చుట్టడానికే ఈ నెల10న మోదీ భారీసభ
  2. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సోనియా కుటుంబం తెలంగాణను దెబ్బతీశాయి
  3. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు తప్ప అమలేదీ
  4. కేంద్రంలో అభివృద్ధి వేగం.. రాష్ట్రానికి కూడా రావాలి
  5. ‘మోదీ కోసం మనం, దేశం కోసం మోదీ’కి జనం పోటెత్తాలి 
  6. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 7(విజయక్రాంతి): వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దీనికి శ్రీకారం చుట్టడానికే ఈ నెల10వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే భారీసభకు ప్రధాని మోదీ వస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలో ప్రజాసమస్యలపై బలమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సోనియా కుటుంబం తెలంగాణను పూర్తిగా దెబ్బతీశాయని, రాష్ట్రా న్ని అప్పుల కుప్పగా మార్చిందని, సీఎం రేవంత్‌రెడ్డి మాటలు తప్ప అమలు చేయ డం లేదన్నారు.

కేంద్రంలో ఉన్న అభివృద్ధి వేగం.. రాష్ట్రానికి కూడా రావాలని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే తెలంగాణకు రూ.12 లక్షల కోట్లను కే్రందం ఖర్చుచేసిందన్నారు. ఈ నెల 10న మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని, ఈ సం దర్భంగా వెయ్యి మంది లంబాడీలతో ప్రధానికి ఘనస్వాగతం పలుకుతామని చెప్పారు.

గద్వాల, సిర్పూర్, కాగజ్నగర్, మంచిర్యాల, ఖమ్మం నుంచి నాలుగు స్పెషల్ ట్రైన్లు ఏర్పా టు చేశామని, వీటి ద్వారా ప్రజలు మోదీ సభకు తరలిరావాలని కోరారు. అలాగే కార్లు, బస్సులను బుక్ చేసుకొని కార్యకర్తలు భారీసంఖ్యలో వస్తున్నారని తెలిపారు. ‘మో దీ కోసం మనం, దేశం కోసం మోదీ’ అనే నినాదంతో జనం పరేడ్ గ్రౌండ్‌కు పోటెత్తాలని కోరారు. గురువారం పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత 12 ఏళ్లుగా మోదీ నాయకత్వం లో కేంద్రం రాష్ట్రంలో రూ.12 లక్షల కోట్ల మేర ఖర్చు చేసిందన్నారు. అలాగే 2,500 కి.మీనేషనల్ హైవేలను అభివృద్ధి చేశామన్నారు. 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తు న్నామని చెప్పారు. అయితే ఈ బహిరంగ సభ దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోందన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, ముఖ్యంగా బెంగాల్‌లో, అన్ని వర్గాల ప్రజలు  బీజేపీకి భారీ మద్దతు ఇచ్చారని చెప్పారు.

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో మోదీ పాల్గొనే అతిపెద్ద బహిరంగ సభ ఇదే కానుందన్నారు. ఈ నెల 10న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని, సభ ప్రాంగణంలో మూడు వేదికలు ఏర్పా టు చేస్తున్నామన్నారు.

భారీస్థాయిలో జనసమీకరణ

ఈ సభకు భారీ స్థాయిలో జనసమీకరణ జరుగుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. వెయ్యి మంది ఆడబిడ్డలు, మాతృమూర్తులు తమ వేషభాషలతో ప్రధానికి ఘన స్వాగతం పల కడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. బీజేపీ కల్చరల్ విభాగం 40 మంది కళాకారుల బృందం సన్నద్ధమవుతోందన్నారు. గద్వాల, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, ఖమ్మం నుంచి ౪ స్పెషల్ ట్రైన్లను, కార్లు, బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

బీజేపీ తరఫున ‘తెలంగాణ ప్రజానీకానికి నేను పిలుపు నిస్తున్నాను.. మోదీ కోసం మనం, దేశం కోసం మోదీ అనే ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు భారీగా సభకు హాజరై ఆశీర్వదించాలి’ అని కోరారు. గత పార్లమెంట్ ఎన్నిక ల్లో మీరు పెద్దఎత్తున ఆదరించినందుకు, ఈ బహిరంగ సభ వేదికగా మోదీ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తారని కేద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

తెలంగాణలో బీజేపీని ఆశీర్వదించాలి

భవిష్యత్తులో తెలంగాణను రక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ పార్టీ, ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం తెలంగాణను పూర్తిగా దెబ్బతీశాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ అప్పు లు దొరుకుతాయో అన్న ఆలోచన తప్ప అభివృద్ధి దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

మాటలు మాత్రం పెద్దపెద్దగా చెబుతారు కానీ పథకాలు అమలు మాత్రం లేదని స్పష్టం చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో ప్రకటన చేస్తున్నా, అమలులో మాత్రం ఏదీ కనిపించడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు ఎక్కడా అ మలు కాలేదు. ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప మరేదీ ముందుకు రాలేదని అన్నారు. డబ్బులు లేవని, అప్పులు రావడం లేదని స్వయం గా చెబుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు.

2014లో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను లక్షల కోట్ల అప్పులతో కూరుకుపోయేలా చేసి, బంగారు తెలంగాణ అంటూ హామీ ఇచ్చిన కేసీఆర్, మార్పు అంటూ వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని ఆరోపించారు. దీంతో నేడు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును ఈ రెండు పార్టీలు అంధకారంలోకి నెట్టాయని, కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.

మోదీ నాయకత్వంలో కేం ద్రంలో ఉన్న అభివృద్ధి వేగం.. రాష్ట్రానికి కూడా రావాలన్నారు. దేశవ్యాప్తంగా బీజే పీ ప్రభుత్వాలు వరుసగా రెండో, మూడోసారి అధికారంలోకి వస్తున్నాయి. గుజరా త్‌లో ఆరోసారి, మహారాష్ట్రలో మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి, బీహార్‌లో మూడోసారి, హర్యానాలో రెండోసారి.. ఈ విజయాలన్నీ మోదీ నాయకత్వం మీ ద ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రతి హామీ అమలు అయ్యే గ్యారెంటీగా మారిందని, అందుకే ప్రజలు మళ్లీ మళ్లీ బీజేపీకి అధికారం ఇస్తున్నారని స్పష్టం చేశారు.

తెలం గాణలో కూడా బీజేపీకి ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాల్సిన సమయం వచ్చింద న్నారు. రాబోయే రెండున్నర సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజాసమస్యలపై బీజేపీ బలమైన పోరాటం చేస్తుందని, కచ్చితంగా ఈ తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం 10వ తేదీన జరుగుతున్న భారీసభ ఇదని, అందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కిషన్‌రెడ్డి కోరారు.