ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వెంటనే ఆపాలి
మాజీ సర్పంచ్ పడిశాల భద్రయ్య డిమాండ్
ఖమ్మం, జూలై 2 (విజయక్రాంతి): బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్వేరో వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని మాధాపురం మాజీ సర్పంచ్ పడిశాల భద్రయ్య ఆరోపించారు. ప్రభుత్వ పథకాలలో అక్రమాలను, బీజేపీ నాయకుల వ్యవహారశైలిని బహిర్గతం చేస్తున్నందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనపై కక్ష కట్టాయని విమర్శించారు. దళితుడైనందుకా, కాంగ్రెస్‌లో చేరాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించినందుకా ఈ వేధింపులు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై పరోక్ష విమర్శల అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కక్ష మరింత పెరిగిందన్నారు. ఆయనకు ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించారని, ఆయన సతీమణిని మార్కెటింగ్ శాఖ నుంచి బదిలీ చేసి లూప్‌లైన్‌లోకి పంపించారని ఆరోపించారు. ఈ చర్యలు 36 లక్షల మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని భద్రయ్య అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి వ్యక్తిగత కక్షలు ఎప్పుడూ ప్రోత్సహించలేదని తెలిపారు. గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత, బీసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు నిలిపివేసి, ఆయన భద్రతా సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.






