3 July, 2026 | 4:06 PM

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు

03-07-2026 03:10 PM

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ కారణంగా రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లతో సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే వరంగల్, ఖమ్మం వంటి తూర్పు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ సూచన పేర్కొంది.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. అదే సమయంలో దక్షిణ, మధ్య జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరుసటి రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అదనంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.

ఆదివారం ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌లు, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. హైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జూలై 7 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ఏపీకి వారం పాటు వర్ష సూచన

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏపీకి వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాగల 24 గంటల్లో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.  కోస్తా తీరం వెంబడి మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.