3 July, 2026 | 3:25 PM

బ్యాంకులో డబ్బులు లేవు.. కుర్చీల్లో సిబ్బంది లేరు..!

03-07-2026 02:34 PM

కోనరావుపేట యూనియన్ బ్యాంకులో రైతుల అరిగోస

కోనరావుపేట, జూలై 3 (విజయక్రాంతి): కష్టపడి పండించిన వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో ఆనందంగా బ్యాంకుకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. కోనరావుపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో నగదు కొరత, సిబ్బంది లేకపోవడం, ఖాతాదారులకు సరైన సేవలు అందకపోవడంతో రైతులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.శుక్రవారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో రైతులు తమ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు చేరుకున్నారు.

అయితే మధ్యాహ్నం 12:30 గంటలకే బ్యాంకులో నగదు లేదని సిబ్బంది చెప్పడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఇదే సమయంలో పలు కౌంటర్ల వద్ద సిబ్బంది కనిపించకపోవడం, కుర్చీలు ఖాళీగా ఉండడం ఖాతాదారులను మరింత అసహనానికి గురిచేసింది.సిబ్బంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నించిన ఖాతాదారులకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దూర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, మహిళలు, రైతులు గంటల తరబడి బ్యాంకు వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమ సమస్యలను వివరించేందుకు వెళ్లిన ఖాతాదారుల పట్ల బ్యాంకు మేనేజర్ యాదగిరి దురుసుగా ప్రవర్తించారని పలువురు రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతాదారులతో మర్యాదగా వ్యవహరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.రైతులకు, వృద్ధులకు సకాలంలో సేవలు అందించాల్సిన బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనరావుపేట యూనియన్ బ్యాంకులో నగదు కొరతను వెంటనే నివారించి, సిబ్బంది కొరత సమస్యను పరిష్కరించడంతో పాటు ఖాతాదారుల ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.