3 July, 2026 | 3:10 PM

కేసీఆర్కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్

03-07-2026 02:28 PM
  1. అబద్ధాల పునాదులపై పదేళ్ల పరిపాలన
  2. బుకాయింపులు, అసత్యాలతో ఎన్నాళ్లు.. 
  3. రోడ్డుపై నిలబడి అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు
  4. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కు సవాల్
  5. పదేళ్లపాటు దోపిడీ చేసింది ఎవరు..? కేసీఆర్ కాదా?

హైదరాబాద్: చేసిన అప్పులను తక్కువ చేసి చూపించేందుకు కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మంత్రిగా పనిచేశానని మరిచిపోయి మరీ హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హరీశ్ రావు.. అనేక విషయాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తేవాలని భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పే అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్నారు. సోషల్ మీడియా వ్యవస్థల ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క సూచించారు. అబద్ధాల పునాదులపై పదేళ్ల పాటు పరిపాలన చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు.. కావాలని పదేపదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మీరు చేసిన అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్ విసిరారు. అప్పులు చేసి ఈ రాష్ట్రంపై పెనుభారం వేసింది నిజం కాదా?.. 2014 నుంచి 2023 వరకు అప్పులు చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

వివిధ మార్గాల ద్వారా మీరు చేసిన అప్పులు రూ 8.212 లక్షల కోట్లు.. బుకాయింపులు, అసత్యాలతో ఎన్నాళ్లు మోసం చేస్తారు. ఈ అప్పులపై నిత్యం మాట్లాడితే రాష్ట్రం పరువు పోతుందని తగ్గాం. మేం వచ్చాక రై. 2.80 లక్షల కోట్లు చెల్లించాం.. 10 శాతం వడ్డీకి కూడా మీరు అప్పులు తెచ్చారు. కట్టాల్సిన వడ్డీని రూ. 34 వేల కోట్లు నుంచి రూ. 11 వేల కోట్లుకు తగ్గించాం. రోడ్డుపై నిలబడి అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. సింగరేణిపై ప్రతిరోజు అబద్ధాలు చెబుతున్నారు. కోల్ బ్లాక్ లు తెచ్చుకునేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లేందుకు అవకాశం లేదని తేల్చిచెప్పారు. సింగరేణిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని హెచ్చరించారు. సింగరేణికి నష్టం కలిగించాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణికి కొత్త బ్లాక్ లు రాకుండా అడ్డుకున్నది మీరే.. సింగరేణికి నష్టం కలిగిస్తే నష్టపోయేది రాష్ట్ర ప్రజలేనని భట్టి విక్రమార్క వివరించారు.  సింగరేణిలో బొగ్గు మాయమైందన్న ఆరోపణలపై భట్టి విక్రమార్క స్పందించారు. కేటీఆర్, హరీశ్ రావు ఆరోపణలపై విచారణ చేయాలని భట్టి ఆదేశించారు. బొగ్గు మాయం ఆరోపణలపై విచారణ చేయాలని సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ కు భట్టి విక్రమార్క ఆదేశించారు.

హాస్టల్ పిల్లలకు క్వాలిటీ వస్తువులు ఇవ్వాలనే టెండర్లు పిలిచామన్నారు. రూ. 1,142 కోట్లకు టెండర్లు పిలిస్తే రూ. 2 వేల కోట్లు అవినీతి అంటున్నారని ఫైర్ అయ్యారు. మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?.. పదేళ్లపాటు దోపిడీ చేసింది ఎవరు.. కేసీఆర్ కాదా?  రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బాధ్యతగా పనిచేస్తున్న మంత్రులపై అభాండాలు సరికాదని హితవు పలికారు. ప్రతి పనీ పారదర్శకంగా జరుగుతోంది.. అన్నీ డిజిటలైజ్ కదా.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా.. అన్నారు. ఎవరిస్థాయి ఏమిటో వారు పోషించే పాత్రతో తెలుస్తోందన్నారు. మీరు చేసిన అప్పులపై అధికారికంగా చెబుతున్నాం.. మీరు చేసిన అప్పులు తీర్చేది.. కాళేశ్వరం కార్పొరేషనా.. ప్రభుత్వమా అన్నారు. ప్రతి రూపాయి అప్పు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలన్నారు. వాళ్లు చేసిన అప్పులు మేం చేసిన అప్పులు రికార్డులు ఇస్తామన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందన్నారు. పదేళ్ల పాటు ప్రజలను తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారని ఆరోపించారు. కీలక విషయాలపై కేసీఆర్ మాట్లాడాలి.. కేటీఆర్, హరీశ్ రావు కాదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.