యూరియా అధిక ధరలపై చర్యలు తీసుకోవాలి
అసిఫాబాద్(విజయక్రాంతి): రైతులకు యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏ. చిరంజీవికి సీపీఐ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి మాట్లాడుతూ వానాకాలం సాగు సీజన్‌లో యూరియా కొరత, ఆన్లైన్ బుకింగ్ సమస్యలు, కొంతమంది వ్యాపారులు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్ని ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని, రైతులపై ఇతర ఉత్పత్తులు బలవంతంగా మోపే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పిడుగు శంకర్, తాళ్లపల్లి దివాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






