3 July, 2026 | 4:20 PM

అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరగాలి

03-07-2026 03:20 PM

సర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలి 

మంథని లో సర్ పై అవగాహన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, జూలై 3(విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ, బిఎల్ ఏ లు,  సూపర్వైజర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని టి పి సి సి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శుక్రవారం ముత్తారం మండలం, మంథని మండలం, మంథని పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ,  సూపర్వైజర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మార్గనిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైన ఫారాలు సక్రమంగా నింపించి, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

సర్  ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా బిఎల్ఏ లు, సూపర్వైజర్ల బాధ్యతేనని పేర్కొన్న ఆయన, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే ప్రత్యేక సవరణ కార్యక్రమం విజయవంతమవుతుందని అన్నారు. అనంతరం సూపర్వైజర్ల సందేహాలను నివృత్తి చేసి, ప్రక్రియ నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఏ లు,  సూపర్వైజర్లు పాల్గొన్నారు.