జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిన వీరేశం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా పురస్కారం
సుల్తానాబాద్ , జూన్ 7 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలకుంట గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇరుకుల్ల వీరేశం మరోసారి జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకొని ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటిషన్ అండ్ ఎగ్జిబిషన్2026లో ఆయన తీసిన ఛాయాచిత్రం తృతీయ బహుమతిని సాధించింది.
ఈ సందర్భంగా రూ.20 వేల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చేతుల మీదుగాస్వీకరించారు.దేశవ్యాప్తంగా కళాకారులు పంపించిన 820 కళాఖండాల్లో జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన 250 ఉత్తమ కళాఖండాలు ప్రదర్శనకు ఎంపిక కాగా, వాటిలో వీరేశం రూపొందించిన ఛాయాచిత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒడిశాలో గిరిజనుల జీవనవిధానాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఛాయాచిత్రానికి ఈ పురస్కారందక్కింది.
ఫోటోగ్రఫీ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ స్థాయి ల్లో అనేక పురస్కారాలు అందుకున్న వీరేశం, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 5వ ఎడిషన్ పోటీల్లో కూడా తృతీయ బహుమతి సాధించడం విశేషం. ఈ సందర్భంగా వీరేశంమాట్లాడు తూ, సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు దేశంలోని ప్రముఖ కళాకారులతో పోటీపడి బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఫోటోగ్రఫీ తనకు ప్రాణమని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రకృతి అందాలు, పండుగలు, గిరిజనుల జీవన విధానాన్ని చిత్రీకరిస్తున్నానని తెలిపారు. ఒక ఫోటో వెయ్యి భావాలను పలికిస్తుందని పేర్కొంటూ, ఫోటో గ్రాఫర్లకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.
అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిరామకృష్ణారావుతో పాటు యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, జేఎన్‌ఎఫ్‌ఏయూ ఫైన్ ఆరట్స్ కళాశాల ప్రొఫెసర్ ఆనంద్ గడప, చిత్రమయి ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మి పాల్గొన్నారు.






