27 July, 2026 | 3:02 PM

కాళేశ్వరంలో ఘనంగా వరుణయాగం

27-07-2026 01:57 PM

సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్ష -చైర్మన్ అవధాని మోహన్ శర్మ.

భూపాలపల్లి/కాళేశ్వరంజులై 27(విజయక్రాంతి): రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం బాలాలయంలో సోమవారం వరుణ యాగాన్ని(Varuna Yagam) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన అర్చకులు నగేష్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్ శర్మ ప్రత్యేక పూజల్లో పాల్గొని వరుణ యాగంలో సంకల్పం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో వర్ధిల్లాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో కళకళలాడాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని ప్రార్థించారు.చైర్మన్ అవధాని మోహన్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవడం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రకృతి అనుకూలంగా ఉండి సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం తరఫున వరుణ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని కోరారు.వరుణ యాగంలో భాగంగా ప్రత్యేక సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, హోమ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యాగ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మహేష్,  ధర్మకర్తలు ,  అడ్డూరి శ్రీధర్ రావు, గందెసిరి సత్యనారాయణ,  జలవంచ సీతారాం, శ్యామ్ సుందర్, తాటిపెల్లి రాజయ్య, ప్రశాంత్ రెడ్డి, మాజీ ధర్మకర్త మెంగాని అశోక్మాజి ఎంపీపీ బందెల సత్తమ్మ , ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాపు తదితరులు పాల్గొన్నారు.