27 July, 2026 | 3:37 PM

గీతం నృత్య స్టూడియోలను ప్రారంభించిన కళైమామణి నందిని రమణి

27-07-2026 03:00 PM

పటాన్ చెరు: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, పండితురాలు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళైమామణి నందిని రమణి, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కొత్తగా స్థాపించిన నృత్య స్టూడియోను సోమవారం ప్రారంభించారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు, కళా విద్యను బలోపేతం చేయడానికి, సృజనాత్మక అభ్యాసం, కళాత్మక నైపుణ్యం కోసం విద్యార్థులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి గీతం నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. తొలుత ఆమె గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఇండక్షన్ కార్యక్రమంలో ‘నృత్యం, సంస్కృతి, సమాజం’ అనే అంశంపై స్ఫూర్తిదాయక ఉపన్యాసం చేశారు.

నూతన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నృత్యం, సంస్కృతి, సమాజం మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని నందిని రమణి అనర్గళంగా వివరించారు. ప్రదర్శన కళలు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో, అలాగే వ్యక్తిగత శీలాన్ని, సామూహిక గుర్తింపును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె నొక్కి చెప్పారు. ప్రఖ్యాత విదుషి టి. బాలసరస్వతితో తనకున్న అనుబంధానికి సంబంధించిన మధుర జ్జాపకాలను కూడా ఆమె పంచుకున్నారు. భారతదేశపు అత్యంత విశిష్టమైన శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో ఒకటైన దాని గురించి విద్యార్థులకు అరుదైన అంతర్దృష్టులను అందించారు.

అలాగే పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచించిన బెహాగ్ రాగంలోని ఒక జావళి ఆకర్షణీయమైన ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ జావళిని ఆమె బాలమ్మ (విదుషి టి.బాలసరస్వతి) వద్ద నేరుగా నేర్చుకున్నారు. ఆమె ప్రదర్శన, విద్యార్థులు, అధ్యాపకులకు ప్రఖ్యాత బాలసరస్వతి శైలి యొక్క ప్రామాణిక అనుభూతిని అందించడమే గాక, ఉత్సాహభరితమైన ప్రశంసలను అందుకుంది. నందిని రమణి విజ్జానదాయమైన సంభాషణకు లలిత, ప్రదర్శన కళల విభాగం హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేసింది. ఆమె పర్యటన, భారతదేశపు కాలాతీత శాస్త్రీయ నృత్య వారసత్వం పట్ల, సమకాలీన సమాజంలో దాని నిరంతర ప్రాముఖ్యత పట్ల విద్యార్థులలో లోతైన అవగాహనను పెంపొందించడానికి స్ఫూర్తినిచ్చిందరి పేర్కొంది.