27 July, 2026 | 3:23 PM

సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

27-07-2026 02:37 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్(Centralized Community Kitchen) ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. ‌ఈ కార్యక్రమం భవిష్యత్ లో దిగ్విజయంగా ముందుకు సాగాలని జరిపించిన నృసింహ మహా యాగంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని పూజలు చేశారు.‌ అనంతరం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించారు.  విద్యార్థులకు అల్పాహారంతో పాటుగా అందించే మిల్క్ యూనిట్ ను ప్రారంభించారు. అల్పాహారం తయారు చేసే యంత్రాలను, కూరగాయలాంజ్ శుద్దిచేసే మెషీనరీని, ఇతర అన్ని రకాల ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు.

విద్యార్థులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అల్పాహారం చేశారు. ఇడ్లి, పొంగల్, ఉప్మా, పూరీ, రాగి ఇడ్లి, ఇతర వంటకాలను ఆయన రుచి చూసారు. అల్పాహారం సమయంలో భట్టి విక్రమార్క విద్యార్థులకు ఇడ్లిలు,ఇతర వంటకాలను వడ్డించారు. భట్టి విక్రమార్క వడ్డించే సమయంలో ఆయనతో మాట్లాడేందుకు, చేయిని కలిపేందుకు విద్యార్థులు ఎంతో ఉత్సాహాన్ని చూపారు. అనంతరం వివిధ పాఠశాలలకు అల్పాహారాన్ని అందించే వాహనాలను ఉప ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సభ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విద్యార్థులంతా ముక్తకంఠంతో పాడడంతో సభ వాతావరణం ఉద్వేగంగా.. ఉత్సాహంగా మారింది.  వేదిక మీదున్న ఉప ముఖ్యమంత్రి చిన్నారుల ఉత్సహాన్ని ప్రత్యేకంగా  అభినందించారు.  సభలో పాల్గొన్న విద్యార్థులు మొత్తం భట్టి.. భట్టి అంటూ నినాదాలు చేయడం విశేషం.