రాష్ట్రంలో భిన్న వాతావరణం
25-04-2026 12:54 AM
ఓ వైపు ఎండలు, మరోవైపు వాన
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం భిన్న వాతావరణం కనిపించింది. ఓ వైపు ఎండ దంచి కొట్టగా, మరోవైపు వర్షం కురిసింది. అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డవగా, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు రికార్డయింది. మరోవైపు హైదరాబాద్ మధ్యాహ్నం వరకు ఎండ సుర్రుమనగా, సాయంత్రానికి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా మల్లాపూర్, నాచారం, హబ్సీగూడ, రామంతాపూర్, తార్నాక, ఓయూ ప్రాంతాల్లో వర్షం పడింది.






