26 August, 2026 | 4:18 AM

వనమహోత్సవం ఒక సామాజిక బాధ్యత

26-08-2026 12:32 AM

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

మహబూబాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’వనమహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అటవీశాఖ అధికారి బి.లావణ్యతో కలిసి ఈదులపూసపల్లి లేక్ వ్యూ నేచర్ పార్క్, చెరువు ప్రాంతంలో కలిసి మొక్కలు నాటి, నీరు పోశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి విస్తృతంగా మొక్కలు నాటడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ప్రతి శాఖకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. 

కేవలం మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా నీరు పోసి కాపాడే బాధ్యతను సంబంధిత అధికారులు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రహదారుల ఇరువైపులా నాటిన మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రాంగణంలో లేదా పరిసరాల్లో కనీసం ఒక మొక్క నాటి, దానిని దత్తత తీసుకున్నట్లుగా సంరక్షించాలని ప్రజలను కోరారు.

పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి శుభకార్యాల సందర్భంగా జ్ఞాపకంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం, పచ్చదనాన్ని కాపాడుకోవడం మనందరి ప్రాథమిక కర్తవ్యమని గ్రహించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు.

జిల్లా లక్ష్యం 43. లక్షల 51 వేలు వివిధ విభాగాలకు చెందిన వారి వారి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు,  డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి ఏ. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వినోద్, ఎఫ్ ఆర్ ఓ సురేష్, మహబూబాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ జ్యోతి, మహబూబాబాద్ తాహసిల్దార్ రాజేశ్వర్, స్థానిక కౌన్సిలర్, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.