వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం
ఎమ్మెల్యేకు సంఘం నాయకుల వినతి
మణుగూరు, మార్చి 10 (విజయక్రాంతి): వడ్డెర కులస్థులను ప్రభుత్వం ఆదుకోవా లని,ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం సంఘం రాష్ట్ర కోశాధికారి గుర్రం శ్రీనివాస్, రాష్ట్ర ఉపా ధ్యక్షులు పెనుగొండ సాంబాశివరావు విలేకరులతో మాట్లాడుతూ, కాయ కష్టంచేసు కుని జీవించే వడ్డెరులకు వచ్చే బడ్జెట్ సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కుల అభివృద్ధికి రూ 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు చొరవ చూపి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వడ్డెర కులస్థులకు రాజకీయ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని, మైనింగ్ రంగంలో వడ్డెరలకు రాయల్టీ సభ్యత్వం, లీజ్ పర్మిషన్లపై ప్రత్యేక హక్కులపై అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వడ్డెరకుల ధ్రువీకరణ పత్రాల్లో వడ్డెర, ఒడియ వడ్డెర, వడ్డె రాజులు అనే పేర్లు స్పష్టంగా నమోదు అయ్యేలా తీర్మానం చేయాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో వడ్డెరలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించని ఎడల రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న వడ్డెర్లందర్నీ కూడగట్టుకొని అసెంబ్లీ ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంఘం నేతలు పేర్కొన్నారు. వడ్డెర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి తురక మధు జిల్లా ఉపా ధ్యక్షులు దేరంగుల వెంకన్న, వివిధ మండలాల వడ్డెర నాయకులు పాల్గొన్నారు.




