10 March, 2026 | 1:54 AM

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్

09-03-2026 01:19 AM

సంగారెడ్డి, మార్చి 8: ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జనరల్ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 సంవత్సరాల లోపు బాలికలకు జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల్లో హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 12,500 మంది బాలికలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ బాలికలందరికీ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక,  99 రోజుల  కార్యక్రమం కాలంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

బాలికల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల సమక్షంలోనే ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.