29 August, 2026 | 9:15 PM

ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్

29-08-2026 08:29 PM

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం (టియంయూఎస్) నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ నియామకాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, యువత పోషించిన పాత్ర ఎంతో కీలకమైందన్నారు. తెలంగాణ విద్యార్థి, యువజన ఉద్యమంలో ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ చురుకైన పాత్ర పోషించారని, ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం టీఎంయూఎస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన గౌరవం, గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా సంఘం తరఫున నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. నకిరేకల్ నియోజకవర్గంలోని ఉద్యమకారులను సంఘటితం చేసి, వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేలా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ పనిచేయాలని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఆకాంక్షించారు.