29 August, 2026 | 10:04 PM

రాష్ట్ర స్థాయి వాలీబాల్‌లో అశ్వారావుపేటకు ప్రథమ స్థానం

29-08-2026 09:01 PM

జాతీయ స్థాయికి ఎంపికైన ఆసుపాక క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జారె

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ స్థాయికి ఎంపికైన ఆసుపాక గ్రామ క్రీడాకారులను శనివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ జారే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన 18వ ఈషా గ్రామోత్సవం గ్రామీణ క్రీడా ప్రోత్సాహ వేదిక ఆధ్వర్యంలోని రూరల్ ప్రీమియర్ లీగ్ 2026 లో అశ్వారావుపేట నియోజకవర్గం సత్తా చాటిందని, రాష్ట్ర స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లో అశ్వారావుపేట మండలం, ఆసుపాక గ్రామానికి చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి, వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం అవకాశాలు లభిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆశభావం వ్యక్తం చేశారు. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జాతీయ స్థాయి పోటీల్లో కూడా అశ్వారావుపేట నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

గ్రామీణ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఆసుపాక క్రీడాకారులు సాధించిన ఈ విజయం నియోజకవర్గంలోని ఇతర గ్రామాల యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు.