29 August, 2026 | 9:43 PM

నైట్ ఫుట్ ప్లేట్ తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

29-08-2026 08:46 PM

వరంగల్,(మహబూబాబాద్),(విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్  కాజీపేట మధ్య నైట్ ఫుట్ ప్లేట్ తనిఖీ (రైలు ఇంజిన్లో ప్రయాణిస్తూ) నిర్వహించారు. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ ను సవివరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ప్రధాన కార్యాలయం, డివిజన్ కు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ - మణుగూరు ఎక్స్ప్రెస్ ఇంజిన్లో తన తనిఖీని చేయడంతో పాటు అదే రైలు ఇంజిన్లోనే ప్రయాణించారు.

ఈ తనిఖీ సమయంలో జనరల్ మేనేజర్ సిగ్నల్స్ అంశాలు, వాటి స్పష్టత, ఓవర్ హెడ్ ట్రాక్షన్, ట్రాక్ పరిస్థితి, సెక్షనల్ వేగ పరిమితి హెచ్చరికలు, వేగాలు మొదలైనవాటిని సమీక్షించారు. రైలును నడుపుతున్న విధుల్లోని సిబ్బంది (లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్) అప్రమత్తతను, అలాగే లోకో పైలట్, ట్రైన్ మేనేజర్లతో సిగ్నల్స్ మార్పిడి చేయడంలో మాస్టర్స్, పాయింట్స్ మెన్ గేట్మెన్ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను కూడా ఆయన గమనించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడిన వరంగల్ రైల్వే స్టేషన్ను జనరల్ మేనేజర్ తనిఖీ చేశారు.

ఈ స్టేషన్ nu 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, భవనం ముఖభాగాన్ని మెరుగుపరచడం, ప్రవేశ ద్వార మండపం, మెరుగైన వేచి ఉండే గదులు, ప్లాట్ఫారమ్పై కప్పు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైన మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు, సదుపాయాలతో అభివృద్ధి చేశారు. స్టేషన్ ప్రాంగణం ,ప్లాట్ఫాం, వెయిటింగ్ హాల్స్, సౌకర్యాల పరిశుభ్రత, నిర్వహణను తనిఖీ చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన సౌకర్యాల గురించి డివిజనల్ అధికారులు జనరల్ మేనేజర్‌కు వివరించారు, అలాగే భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల గురించి జిఎం సమీక్షించారు. జనరల్ మేనేజర్ స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రతినిధుల నుండి వినతులను స్వీకరించారు.