29 August, 2026 | 10:06 PM

వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్

29-08-2026 08:25 PM

- బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. శనివారం గజ్వేల్‌లోని శోభ గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, పింఛన్లు, మహిళలకు ఆర్థిక సాయం, ఫీజు రీయింబర్స్‌ మెంట్, ఉద్యోగాల వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి కుంటుపడ్డాయని ఆరోపించారు. హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.