29 August, 2026 | 9:01 PM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె

29-08-2026 08:32 PM

గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచన

దమ్మపేట,(విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రజా పాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మండల పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వయంగా విని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకోవాలని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలు అందించాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన సమయాన్ని పూర్తిగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కల్పించి అర్హులైన వారికి పథకాలు అందేలా గ్రామస్థాయిలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.