18 July, 2026 | 2:26 AM

కందనూలులో నకిలీ ఎరువుల కలకలం!

18-07-2026 02:11 AM

ఓల్డ్ స్టాక్ పేరుతో తక్కువ ధర అంటూ రైతులకు బురుడీ

పంటలకు వినియోగించగా నకిలీగా గుర్తించిన రైతులు

మహాదేవునిపేటలో 111 బస్తాలు సీజ్- 

కలెక్టర్, ఎస్పీ హుటాహుటిన విచారణ

నాగర్‌కర్నూల్/బిజినేపల్లి, జూలై 17 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేట గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం కలకలం రేపింది. ఓల్ స్టాక్ పేరుతో తక్కువ ధరకే డీఏపీ ఎరువుల బస్తా ఇస్తామంటూ గ్రామానికి చెందిన ఓ ఫర్టిలైజర్ దుకాణాదారు కొంతమంది రైతులకు నకిలీ డిఏపి  ఎరువుల బస్తాలను అంటగట్టారు. రైతులు తమ పంట పొలాల్లో చల్లిన అనంతరం భూమిలోకి ఇంకొక పోవడంతో మోసపోయినట్లు గుర్తించి సదరు వ్యక్తిని నిలదీశారు.   

విశ్వసనీయంగా సమాచారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మండల అధికారులను అప్రమత్తం చేస్తూనే  గ్రామానికి చేరుకొని రైతులతో విచారించారు. కర్ణాటక రాష్ట్రం నుండి సుమారు 150 బస్తాలను తీసుకొచ్చిన కొందరు వ్యక్తులు గ్రామానికి చెందిన 8 మంది రైతులకు బస్తా ధర 1600 చొప్పున విక్రయించినట్లు గుర్తించారు. ఇందులో 39 బస్తాలను పంట పొలాల్లో వినియోగించగా ఆయా రైతుల ఇల్లల నుండి 111 డిఏపి ఎరువుల బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్కడి నుండి ఎవరు కొనుగోలు చేశారు. రైతులకు ఎవరు విక్రయించారన్న అంశాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. నగదు లావాదేవీలతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఎరువుల నమూనాలను ప్రయోగశాలకు పంపి నకిలీగా తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువుల సరఫరా మార్గం, కొనుగోలు చేసిన రైతుల వివరాలు, ఇతర ప్రాంతాల్లో కూడా విక్రయాలు జరిగాయా అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ పోలీసులకు ఆదేశించారు.

పచ్చిమాసియాలోని ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయిల్ ధరలతో పాటు ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదే అంశాన్ని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు అమాయక రైతులను బురిడీ కొట్టించేందుకు ముందుకొచ్చారు. ఓల్ స్టాక్ పేరుతో తక్కువ ధరకే ఎరువులిస్తామాంటూ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లోని ఫర్టిలైజర్ దుకాణా దారులు రైతులకు నకిలీ ఎరువులను అంట గడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొంతమంది దర్జాగా బోర్డుల ఏర్పాటు చేసుకొని మరీ ఎరువులు మందులను విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.  మరికొంతమంది ఫర్టిలైజర్ దుకాణదారులు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ దుకాణాలతో పాటు పేరుతో రహస్యంగా నకిలీ ఎరువుల భద్రత కోసం గోదాములను ఏర్పాటు చేసి అక్రమ దందా చేపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ అక్రమార్కులు పంజా విసురుతున్నారని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం బయటపడిన ఈ నకిలీ ఎరువుల వ్యవహారంతో రైతులు ఏది నకిలీ ఏది ఒరిజినల్ తేల్చుకోలేక తల మునకలవుతున్న పరిస్థితి ఏర్పడింది.