30 May, 2026 | 2:38 AM

ఆగని అక్కసు!

30-05-2026 02:01 AM

తెలంగాణ చరిత్రపైనే అవాకులు.. 

డిక్షనరీలో తెలంగాణ లేదంటూ టీ టీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని వ్యాఖ్యలు

సమైక్యవాదుల ప్రసన్నం కోసం దిగజారుతున్న వైనం 

తెలంగాణవ్యాప్తంగా రాజకీయ దుమారం 

మన ఆత్మగౌరవం, అస్తిత్వంపై దాడి అంటున్న తెలంగాణవాదులు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, ఉద్యమ చరిత్ర చుట్టూ తీవ్ర చర్చ మొదలైంది. టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షు డు బక్కని నరసింహులు ‘తెలంగాణ పదం డిక్షనరీలో లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీశాయి. తెలంగాణ ఉద్యమ భావోద్వేగాలు ఇంకా ప్రజల మనసులో బలంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాగి న పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువకు లు, ఉద్యోగులు చేసిన త్యాగాలు, ఆత్మహత్యలు, నిరసనలు ఇవన్నీ తెలంగాణ ప్రజల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. అలాంటిది రాష్ట్ర పేరునే ప్రశ్నిం చేలా మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని పలువురు నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ అనేది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు అది ఒక భావోద్వేగం, ఒక చరిత్ర, ఒక స్వాభిమానం అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు వైరల్ అవుతు న్నాయి. బీఆర్‌ఎస్ నాయకులు ఈ అంశాన్ని తీవ్రం గా తప్పుబడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించిన శక్తుల అసలు భావజాలం ఇప్పటికీ మారలేదని ఆరోపిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దానికి పైగా అవుతున్నా ఇంకా తెలంగాణ అస్తిత్వాన్ని అంగీకరించలేకపోవడం బాధాకరం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై సోషల్‌మీడియా లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాత చారిత్రక గ్రంథాలు, నిజాంకాలం రికార్డు లు, పత్రికాకథనాలు, తెలంగాణ పదం ఉన్న పుస్తకాల ఫొటోలు షేర్‌చేస్తూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.

కొందరు తెలం గాణ అనే పదం లేకపోతే తెలంగాణ ఉద్య మం ఎలా జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సంఘటనలను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొదలుకుని గ్రామీణ ప్రాంతాల దాకా ప్రజలు ఉద్యమంలో భాగమయ్యారని అలాంటి ఉద్యమ చరిత్రను అవమా నించేలా మాట్లాడటం సరైంది కాదని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో బక్కని నర్సింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సమయంలోనే తెలంగాణ నడిబొడ్డున అమీర్‌పేట మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయ డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఒకవైపు టీడీపీనాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టంచడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. సమైక్యవాదులను ప్రసన్నం చేసుకునేందుకు తెలంగాణ నాయకులు దిగజారి పోతున్నారని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. 

మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి: పృథ్విరాజ్, తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు  

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేసినట్టే. అక్కడ మహానాడులో తెలంగాణను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేయడం వెనుక వారి ఆధిపత్యం చెలాయించేందుకేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న తెలంగాణపై కావాలనే ఇలాం టి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

తెలంగాణలోనూ మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామని లోకేష్ వ్యాఖ్యానించడంతో రేవంత్ రెడ్డి వారి సామంతరాజు అని స్పష్టమవుతున్నది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం వారికి మనోళ్ల బానిసత్వానికి పరాకాష్ట. ఇటీవల ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా వారి పార్టీ కోసం పడిన దత్తాత్రేయ, ఇతర నాయకుల ఇళ్లకు వెళ్లకుండా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి కలువడం వెనుక భవిష్యత్‌లో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేప్లాన్ ఉంది.

తెలంగా ణ గళా న్ని అణచివేసేందుకే ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని ఇన్నే ళ్లు అయినా కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. తెలంగాణ చరిత్రను లేకుండా చేసే కుట్రలో భాగంగానే బక్కని నర్సింహులు వ్యాఖ్యలు. మన వాళ్లే ఆంధ్రోళ్లకు తొత్తులుగా మారుతున్నారు. 

నర్సింహులు లాంటి చెంచాగాళ్లతో చంద్రబాబే మాట్లాడిస్తడు 

ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం మధ్య లో ఉన్న ప్రాంతమే ఆనాటి త్రిలింగ దేశం... నేటి తెలంగాణ. ఈ విషయంలో అజ్ఞాని అయిన బక్కని నర్సింహులుకు తెల్వదు. ఇలాంటి చెంచాగాళ్లతో చంద్రబాబే మాట్లాడిస్తడు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆంధ్రవారే రాసినపుస్తకాలు ఉన్నా యి. అసలు ఆంధ్ర పేరే ఎక్కడా లేదు. టీటీడీపీ మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు డ్రామాలు చేస్తున్నడు.

ఆయనకు, ఆయన బాస్ చంద్రబాబుకు చదువులేదు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నడు. తెలంగాణ ఘనచరిత్రపై ఎంతోమంది అనేక పుస్తకాలు రాశారు. ఏపీలో కూడా ఇంత బానిసత్వం లేదు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం, చరిత్ర విలువ తెలంగాణ వాళ్లకే తెలుస్తది. నర్సింహులు లాంటి తొత్తులకు తెల్వదు.

పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు