24 July, 2026 | 4:35 PM

ఎల్‌ నినో ప్రభావంపై రైతులకు అవగాహన

24-07-2026 04:11 PM

- గంగారం గ్రామంలో కేవీకే క్షేత్ర సందర్శన

టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గంగారం గ్రామంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో మొక్కజొన్న, పత్తి పంటల నిర్ధారణ క్షేత్ర సందర్శనతో పాటు ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ (కాంటింజెన్సీ) పంట ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త & హెడ్ డా. టి. భరత్ మాట్లాడుతూ.. ఎల్‌ నినో పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి వినియోగం, పంట యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన పంట ప్రణాళికలు, సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. అనంతరం శాస్త్రవేత్తల బృందం మొక్కజొన్న, పత్తి పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించింది. మొక్కజొన్నలో ఫాల్ ఆర్మీవార్మ్ ఉధృతి, కలుపు మొక్కల సమస్యను గుర్తించి, తగిన హెర్బిసైడ్లు, పురుగుమందుల వినియోగంపై సూచనలు ఇచ్చారు. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల (సకింగ్ పెస్ట్స్) ఉధృతి కనిపించడంతో సమగ్ర పంట సంరక్షణ (IPM) చర్యలను పాటించాలని రైతులకు సూచించారు.

ఈ సందర్భంగా మొక్కజొన్న పంటకు అవసరమైన కలుపు నివారణ మందులు (హెర్బిసైడ్లు), అలాగే సమగ్ర పురుగు నిర్వహణలో భాగంగా నీలం, పసుపు రంగు స్టిక్కీ ట్రాప్‌లు రైతులకు పంపిణీ చేశారు. వీటి వినియోగం ద్వారా పురుగుల ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతంగా నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రవేత్తల సూచనలను ఆసక్తిగా తెలుసుకున్నారు.