30 May, 2026 | 2:39 AM

విలీనం ప్రకటించాలి

30-05-2026 01:55 AM
  1. జూన్ 2న అపాయింటెడ్ డే కావాల్సిందే! 
  2. లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం
  3.  31న అన్ని డిపోల వద్ద రెడ్ బ్యాడ్జీలు ధరించి నిరసన 
  4. సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలి 
  5. మంత్రి పొన్నం వ్యాఖ్యలతో కార్మికుల్లో గందరగోళం 
  6. మీడియా సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలు

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేస్తూ అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షను చేపడతామని పేర్కొన్నారు. 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి కార్మికులంతా డిమాండ్ డేలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనంచేసే అంశంపై బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నదని, దీనిపై ప్రభుత్వం స్పష్టతనిస్తూ జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విద్యా నగర్‌లోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కోకన్వీనర్ బీ యాదగిరి మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని విజ్ఞప్తిచేశారు. తమకు విలీనం, యూనియన్ ఎన్నిక ల్లో ఏది ముందు కావాలని సీఎం అడిగితే, తామంతా తొలుత విలీనమే చేయాలని రాతపూర్వకంగా ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పామన్నారు. కానీ తొలుత యూనియన్ ఎన్నికలు నిర్వహించి తర్వాత విలీనం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయన్నారు.

దీనిపై ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని తామంతా కలిసి ఆర్టీసీ కార్మికలో కమంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వెంటనే విలీనం చేయాలని తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ముందు విలీనం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. దీనిపై ఇంకా ఏమాత్రం కాలయాపన చేయకుండా త్వరగా అమలుచేయాలని, కార్మికులంతా ఎదురుచూస్తున్నారన్నారు.

తీపి కబురు చెప్పాలి..

గత ప్రభుత్వం ఆర్టీసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి చర్యలు చేపట్టి గెజిట్ కూడా పాస్ చేసిందన్నారు. కేవలం విలీన తేదీని ప్రకటించాల్సిన సమయంలో ప్రభుత్వాలు మారాయని, అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రుల సబ్ కమిటీ చర్చించి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి అంగీకరించిందన్నారు. అదేవిధంగా మే 1వ తేదీన సీఎం కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ముందుగా విలీనం కావాలో ఎన్నికలు కావాలో చెప్పాలని కోరగా కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో ఎన్నికల కంటే ముందు విలీనం కావాలని స్పష్టం చేశామన్నారు.

కానీ ఇటీవల మంత్రి చేసిన ఆ వ్యాఖ్యల వెనుకాల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలతో కార్మికుల ఆకాంక్షలపై నీళ్ళు చల్లినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర సంవ త్సరాల తర్వాత ఎన్నికలు పెడతామంటే ఏం అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, వెంటనే సీఎం స్వయంగా ఈ అంశంపై స్పందించి జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే ప్రకటించాలని కోరారు. ప్రతినెల దాదాపు 200 మంది వరకు కార్మికులు రిటైర్డ్ అవుతున్నారన్నారు.

 ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు జరుపుకునే విధంగా తీపి కబురు చెప్పాలని వారు కోరారు. పీఆర్సీ వేతనాలు జూలై నుంచి అమలవుతాయని, కార్మికులకు రావాల్సిన 2017, 2021 బకాయిలను కూడా చెల్లించాలని వారు కోరారు. కార్మికుల కోసం జేఏసీ పనిచేస్తున్నదని, కొన్ని సంఘాలు మాటలు మార్చి కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారని, వారి మాటలను కార్మికులు పట్టించుకోకూడదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎంఎస్ అలీ, డీ గోపాల్, జే రాఘవులు, బుద్ధ విశాల్, మనోహర్, ఎఎస్ రెడ్డి, జనార్దన్, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.