విద్యా వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి.. ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ముందు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లలో ఎలాంటి తప్పు లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. విద్యార్థులపై తక్షణం దాడులు ఆపివేయాలని కేంద్రప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కేంద్రానికి సూచించారు. విద్యావ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో వారికి చదువుకునే అవకాశాలను కల్పించారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) అబద్ధాలు చెప్పడం మానేయాలి, ఇది దేశ భవిష్యత్తుపై దాడి చేసిందని ఆరోపించారు.
యువత కేవలం మూడు డిమాండ్లు మాత్రమే చేస్తున్నారు. మొదటిది, ఈ పరిస్థితికి, ప్రశ్నపత్రాల లీకేజీకి, శాంతియుత నిరసన చేపట్టేలా వారిని ప్రేరేపించిన పరిస్థితులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రిని తొలగించాలి. రెండవది, ఈ యువతపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపిన, లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. మూడవది, ఈ వ్యవస్థకు అధిపతిగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దీనివల్ల ఇబ్బందులు పడిన వేలాది మంది యువతకు క్షమాపణ చెప్పాన్నారు. యువత చాలా మంది తీవ్రమైన శారీరక గాయాలకు గురయ్యారు. పెల్లెట్ గన్‌లను (pellet guns) ఉపయోగించలేదని ప్రభుత్వం పేర్కొంది. పెల్లెట్ గన్ వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ వ్యక్తి కంటికి గాయమై, ఒక కంటి చూపును కోల్పోయాడు. ఈ యువతే భారతదేశ భవిష్యత్తు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ, వేలాది మంది యువకులు పెల్లెట్ గన్ దాడులకు, లాఠీచార్జికి, ఇతర దాడులకు గురయ్యారు. వారు ఎందుకు నిరసన తెలిపారు? ఎందుకంటే వారి పరీక్షా పత్రం లీక్ అయ్యింది. పోలీస్ నియామక పరీక్ష కోసం వారు ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమయ్యారు, కానీ చివరికి ఒక రోజు ఆ పరీక్షా పత్రం లీక్ అయిందని వారికి తెలిసింది. 60–70 లక్షల రూపాయలు ఉన్నవారు.. ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేయగలిగారు, మిగిలిన వారు మాత్రం నష్టపోయారు. లక్షలాది మంది యువకులకు ఇదే పరిస్థితి ఎదురైంది." అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.






