2 July, 2026 | 2:45 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్

02-07-2026 01:55 PM

అబద్ధాలకు ఆస్కార్ ఇస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అర్హులే

హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) బీఆర్ఎస్, కాంగ్రెస్(Congress-BRS) పార్టీలపై మరోసారి విమర్శలు సంధించారు. మీ డ్రామాలు చూస్తుంటే టీవీషోను తలపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నటన అద్భుతం అన్నారు. ముందే రిహార్సల్ చేసి పోటాపోటిగా నటనలో జీవిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అర్హులేనని చమత్కరించారు. ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు(BJP President Ramchander Rao) ఆధ్వర్యంలో డేట్, టైం, వేదిక చెబుతామని సూచించారు. గురుకులాల టెండర్లు, అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రండి అని బండి సంజయ్ ఇరు పార్టీ నేతలకు సవాల్ విసిరారు. ప్రజల పశ్నలకు జవాబిచ్చేందుకు మీరు సిద్దమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు ప్రజల ముందుంచేందుకు తాము సిద్ధమన్నారు.

''నేడు కాంగ్రెస్, BRS పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారాలను చూస్తుంటే 'బిగ్ బాస్' రియాలిటీ షోను చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. వారు కెమెరాల ముందు గొడవ పడుతున్నట్లు నటిస్తారు, కానీ కీలక సమయాల్లో మాత్రం ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఇదే వారి అసలు స్క్రిప్ట్. ఈ రాజకీయ నాటకాలు ఇక చాలు. ఈ పార్టీలతో బహిరంగ చర్చకు వేదికను సిద్ధం చేయాల్సిందిగా నేను వ్యక్తిగతంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావును కోరుతున్నాను. గురుకుల పాఠశాలల టెండర్లు, తెలంగాణపై పెరుగుతున్న అప్పుల భారం, అవినీతి, పాలనా వైఫల్యాల గురించి కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలి. వాస్తవాలతో ఈ రెండు పార్టీల బాగోతాన్ని BJP బయటపెడుతుంది. అలాగే,  ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ వృద్ధి, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన విశేష కృషిని కూడా ప్రజల ముందు ఉంచుతుంది. కాంగ్రెస్-BRS పార్టీలను 'డబుల్ ఎలిమినేషన్' చేయడానికి, 'డబుల్ ఇంజిన్' BJP ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి  తెలంగాణ సిద్ధంగా ఉంది.'' అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.