ట్రై-కార్పొరేషన్లకు ఏకీకృత చట్టం!
- త్వరలో కొత్త క్యూర్ యాక్ట్
జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరికి ఒకే నిబంధనలు
హైదరాబాద్, సిటీ బ్యూరో మా ర్చి 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర విస్తీర్ణం, జనాభా పెరుగు తున్న నేపథ్యంలో పరిపాలనను మరింత సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. క్యూర్ పరిధిలోకి వచ్చే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కోసం ఒకే ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని నిశ్చయించింది. ప్రస్తుతం విడివిడిగా ఉన్న జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఇకపై ఒకే చట్టం వర్తించనుంది.
ఈ మేరకు రూపొం దించిన నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ మహానగర పాలనలో సమన్వయం పెంచడమే లక్ష్యంగా ఈ ట్రై-కార్పొరేషన్ యాక్ట్ రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ మూడు కార్పొరేషన్లకు వేర్వేరు నిబంధనలు ఉండటం వల్ల పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను విధింపు, అడ్వర్టై జ్మెంట్ పాలసీ, ఇతర పౌర సేవల విషయంలో మూడు చోట్లా ఒకే రకమైన నిబంధనలు ఉండాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే మూడు కార్పొరేషన్ల కార్యకలాపాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి.




