‘సర్’తో కాంగ్రెస్‌లో ఆందోళన!
- అప్రమత్తమవుతున్న ఆ పార్టీ నేతలు
- రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్‌ఏల నియామకం
- ఓట్ల తొలగింపు అడ్డుకునేందుకు వారికి శిక్షణా కార్యక్రమాలు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీకి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ( ఎస్‌ఐఆర్ ) భయం పట్టుకుంది. ఇప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన హస్తం పార్టీ నేతల్లో మొదలైంది. సర్ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేస్తోంది. అందుకు పోలింగ్ బూత్‌లెవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) కూడా నియమించి వారికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్ ప్రక్రియను ఉపయోగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇతర పార్టీ లు బలంగా ఉన్న చోట డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయంటూ వివిధ కారణాలు చూపి ఓట్లు తొలగించడం వల్ల బీజేపీ కొద్ది మెజార్టీతో గెలిచిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బెంగాల్‌లో బీజేపీ గెలిచిన తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ నేతలు ప్రకటించడంతో ఇక్కడి కాంగ్రెస్ నేతలు మరింత అప్రమత్తమయ్యారు. తెలంగాణలో కూడా ముస్లిం మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీయేతర పార్టీల ఓటు బ్యాంకును తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
సర్ పేరుతో రాజకీయ కుట్రలు చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ , పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ‘సర్’ పైన చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






