31 July, 2026 | 6:31 PM

కరీంనగర్‌లో బిల్డ్ ఎక్స్‌పో

31-07-2026 05:48 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కరీంనగర్ లోని ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 1, 2 తేదీలలో 6వ 'బిల్డ్ ఎక్స్‌పో - 2026' నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా (ఏసీసీఈఐ) కరీంనగర్ సెంటర్ ప్రతినిధులు తెలిపారు.

శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ సెంటర్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఛైర్మన్ నల్ల లక్ష్మయ్య, ఎక్స్‌పో కన్వీనర్ పాక పావన కృష్ణ, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్ స్పాన్సర్‌షిప్ కమిటీ హెడ్ వేల్పుల శ్రవణ్, మాట్లాడుతూ, ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు. ఇల్లు నిర్మించుకునే సామాన్య ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తుల ఎంపిక, ఆధునిక నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రతీ రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిల్డ్ ఎక్స్‌పోను ఈసారి ఆరోసారి ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణానికి అవసరమైన ఫౌండేషన్ నుంచి ఇంటీరియర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని స్పష్టం చేశారు. స్టీల్, సిమెంట్, పెయింట్స్, హార్డ్‌వేర్, ప్లైవుడ్, లామినేట్స్, లిఫ్ట్లు, వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్, ఎలక్ట్రికల్, శానిటరీ ఉత్పత్తులు, యూపీవీసీ విండోస్, పీటీ స్లాబ్ టెక్నాలజీతో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎక్స్‌పోకు ప్రవేశం ఉచితమని, సందర్శకులకు లక్కీ కూపన్లు కూడా అందజేస్తామని వివరించారు.