మహిళా సాధికారతకు వేదికగా ఉడాన్
- జిటో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం
- ముఖ్య అతిథిగా ప్రముఖ ఫిట్నెస్ ఐకాన్ కిరణ్ డెంబ్లా
- రెండు రోజుల పాటు కొనసాగనున్న ప్రదర్శనలో 110కు పైగా స్టాల్స్
సికింద్రాబాద్, మే29 (విజయక్రాంతి): మహిళా సాధికారతతో పాటు చిన్న తరహా పరిశ్రమలు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) ఆధ్వ ర్యంలో ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ ఎగ్జిబిషన్ క్లాసి క్ గార్డెన్ లో ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫిట్నెస్ ఐకాన్ కిరణ్ డెంబ్లా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. మహిళలు వ్యాపార రంగంలో మరింత ముందుకు రావాలని, తమ ప్రతిభను ప్రపంచానికి చాటాలని ఆమె ఆకాంక్షించారు. ఈ ఏడాది ఉడాన్ ఎగ్జిబిషన్ను జిటో అధ్యక్షురాలు సుధా కీమ్తీ నేతృత్వంలో, కార్యదర్శి టీనా షా, ఖజాంచీ అనితా రాంకా మరియు ఉడాన్ బృందం సమిష్టిగా నిర్వహిస్తున్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతోందని నిర్వాహకులు తెలిపారు.
ప్రస్తుతం ఎగ్జిబిషన్లో 110కు పైగా స్టాల్స్ ఏర్పాటు కావడం జిటోపై ఉన్న విశ్వాసం, ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్యాషన్, జ్యువెలరీ, హ్యాండ్క్రాఫట్స్, హోమ్ డెకర్, లైఫ్స్టైల్ ఉత్పత్తులు, ఫుడ్ మరియు వివిధ రంగాలకు చెందిన మహిళా ఆధ్వర్యంలోని వ్యాపార సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. వ్యాపార ప్రోత్సాహంతో పాటు ప్రతిభ కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించడం ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రతి ప్రాంతానికి చేరువ కావాలనే లక్ష్యంతో మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు నెట్వర్కింగ్, అభి వృద్ధి మరియు కొత్త వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా ఉడాన్ బృందం కృషి చేస్తోందన్నారు.మహిళా ప్రతిభ, వ్యాపార నైపుణ్యం, సాధికారతకు ప్రతీకగా ‘ఉడాన్’ ఎగ్జిబిషన్ నిలుస్తుందని జిటో ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధా జైన్ తో పాటు జీటో మహిళలు పాల్గొన్నారు.






