14 July, 2026 | 4:27 AM

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

14-07-2026 02:01 AM
  1. కేంద్ర మంత్రులతో నేడు సమావేశం 
  2. రాష్ట్రంలో ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అనుమతులపై చర్చ
  3. సీఎం కంటే ముందే ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
  4. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశం 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో ఆయన వరుసగా సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల విస్తరణ, కేంద్ర నిధులు, అనుమతులు వంటి అంశాలపై ఈ భేటీల్లో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, ప్రాంతీయ కనెక్టివిటీ విస్తరణ, కొత్త విమాన సర్వీసులు, విమానయాన రంగానికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలు, కేంద్ర పథకాల అమలు, రాష్ట్రానికి అవసరమైన సహకారంపై చర్చించే అవకాశం ఉంది.

అలాగే కేంద్ర రహదారులు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారి ప్రాజెక్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపుల అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఈ భేటీల అనంతరం తెలంగాణకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి కంటే ముందే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశం అయినట్టు సమాచారం.