14 July, 2026 | 4:10 AM

నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రాజెక్టులను ఎందుకు కట్టారు?

14-07-2026 01:36 AM

కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే

  1. వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారు 
  2. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై బీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలి 
  3. కన్నెపల్లి వద్ద  నీళ్లు ఎత్తిపోయవచ్చని గోబెల్స్ ప్రచారం 
  4. దేవాదుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాం 
  5.  పెండింగ్ బిల్లులను విడుదల చేస్తాం 
  6. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి 
  7. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ బ్యారేజీ సందర్శన

ములుగు, జూలై 13 (విజయక్రాంతి): నదిలో పారే నీటిని నేరుగా ఎత్తిపోసే అవకాశం ఉన్నా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు ఎందుకు కట్టారో గత ప్రభుత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టులు కట్టి వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. తాము నిపుణుల సూచనలతో కాళేశ్వరం, మేడిగడ్డ బరాజ్ భద్రతపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

దేవాదుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారం ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క సారలమ్మ బరాజ్‌ను వారు సందర్శించారు. గుట్టల గంగారం జె చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్‌ను,  మోటార్ల పనితీరును, ఎత్తిపోతల సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. నదిలో పారే నీటిని నేరుగా ఎత్తి పోసుకునే అవకాశం ఉన్నప్పటికీ, వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆ మూడు ప్రాజెక్టులను ఎందుకు కట్టారో ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ నేతలను డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చని ప్రజలను తప్పుదోవ పట్టించేలా విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

గ్లోబల్స్ ప్రచారం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలాన్ని సమయానుకూలంగా ప్రజల ముందు పెడతామని ప్రకటించారు. ఇంజనీర్ల మాటను పక్కనబెట్టి, సొంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి బీఆర్‌ఎస్ పాలకులు దెబ్బతీశారని ఆరోపించారు. 

గత పాలకుల అవినీతి అనాలోచిత నిర్ణయాల వల్లే మూడేళ్లకే కాళేశ్వరం బ్యారేజీలు కృంగిపోయాయన్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అదే గోదావరి.. అదే ఇసుక పునాది.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు గట్టిగా ఉంటే, బీఆర్‌ఎస్ కట్టినవి ఎందుకు కూలిపోయాయని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామసాగర్ రీ డిజైన్ పేరిట గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును వృథా చేసిందన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బరాజ్ భద్రతపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగానే తమ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ‘మేడిగడ్డ వద్ద గేట్లు మూసివేస్తే బరాజ్ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. వారి సూచనలను ప్రాణప్రదంగా పాటిస్తూ ముందుకు సాగుతున్నాం’ అని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చే నివేదికలను బట్టే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

బరాజ్‌లలో నీళ్లు నింపడం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారని, సంపూర్ణంగా మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లు మూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీటిని లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డలో 5, అన్నారంలో 10, సుందిళ్లలో 8 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. పంపుల లెవెల్స్ అందుకోవాలంటే గేట్లు మూయాలి.. కానీ గేట్లు మూస్తే బరాజ్‌లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు.

దేవాదుల కోసం 146 కోట్లు 

దేవాదుల ప్రాజెక్ట్ పెండింగ్ పనుల కోసం రూ.146 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేస్తామని, భూసేకరణ కోసం రూ.58 కోట్లు, పనుల కోసం రూ.74 కోట్లు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం రూ.14 కోట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు సంపూర్ణంగా నీరందిస్తామని, ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో మొత్తం 22 రిజర్వాయర్లను నింపుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఉన్న 10 పంపులను నిరంతరాయంగా నడుపుతూ దేవాదుల కింద ఉన్న 12 జిల్లాలకు నీరందిస్తామని, గోదావరి పరివాహక ప్రాంతంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కోసం ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పూర్తిగా బహిర్గతం చేసి ప్రజలకు సమగ్రంగా వివరిస్తామన్నారు. పంపింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి 38.16 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగిస్తామని, 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెప్పారు. 

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటాం

రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే కార్యాచరణను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీరు, తాగునీటి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు ప్రజా ప్రభుత్వం దూరదృష్టితో కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.

గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని, ఎక్కడెక్కడ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందో అక్కడ ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందుకోసం ఎంత వ్యయంతో కూడుకున్న , విద్యుత్ బిల్లులు ఎంత భారమైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వెనుకాడబోమనే స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. 

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వరి దిగుబడులు ప్రజా ప్రభుత్వ హయాంలోనే నమోదయ్యాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. యాసంగి సీజన్లోనే 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి, వరి కొనుగోళ్ల రూపంలో సుమారు రూ.84 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేశామని, యాసంగి పంటకే రూ.19 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,  ఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ  సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో, డీఎఫ్‌ఓ వికాస్ మినాలు, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ సంపత్ రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు.