ఏఐ యుగంలో సోషల్ సన్సైస్ భవిష్యత్
* ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థను వేగంగా మార్చుతోంది. నేడు విద్యార్థులు చదివే డిగ్రీలు రేపటి ఉద్యోగ మార్కెట్‌కు అవసరమా అన్న ప్రశ్న ప్రతి దేశం ముందుంది. దీంతో కొన్ని దేశాలు పాత కోర్సులను పూర్తిగా తొలగిస్తుంటే, మరికొన్ని ఏఐని అనుసంధానం చేస్తున్నాయి. భాషలు, కళలు, సోషల్ సైన్సెస్ తదితర కోర్సులను రద్దు చేస్తున్నాయి. దీంతో సోషల్ సైన్సెస్(సామాజిక శాస్త్రాల) భవిష్యత్తుకు సరికొత్తగా ఆయా దేశాలు శ్రీకారం చుడుతున్నాయి.
కృత్రిమ మేధస్సు(ఏఐ) ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థను వేగంగా మార్చుతోంది. నేడు విద్యార్థులు చదివే డిగ్రీలు రేపటి ఉద్యోగ మార్కెట్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయన్న ప్రశ్న ప్రతి దేశం ముందుంది. ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు దేశాలు భిన్నమై న మార్గాలను ఎంచుకుంటున్నాయి. కొన్ని దేశాలు పాత కోర్సులను పూర్తిగా తొలగిస్తుం టే, మరికొన్ని ఇప్పటికే ఉన్న కోర్సుల్లో ఏఐని అనుసంధానం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా సోషల్ సైన్సెస్(సామాజిక శాస్త్రాల) భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. 2021 నుంచి 2025 మధ్య చైనా దేశవ్యాప్తంగా 12,200కు పైగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రద్దు చేసి, 10,200కు పైగా కొత్త కోర్సులను ప్రారంభించింది. దీని ప్రభావం దేశంలోని 30 శాతానికి పైగా డిగ్రీ ప్రోగ్రామ్‌లపై పడింది. కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సుల్లో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, ఎంబాడీడ్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
మరోవైపు రద్దు చేసిన కోర్సుల్లో భాషలు, కళలు, సోషల్ సైన్సెస్ వాటా ఎక్కువగా ఉంది. 2023లోనే 2025 నాటికి 20 శాతం కోర్సులను పునర్వ్యవస్థీకరించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాతో సెమీకండక్టర్లు, ఏఐ రంగాల్లో పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేపట్టింది. మైకోస్ నివేదిక ప్రకారం.. సామాజిక శాస్త్రాల పట్టభద్రులతో పోలిస్తే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నెలవారీ ఆదాయం దాదాపు 30 శాతం ఎక్కువగా ఉంది. అమెరికాలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రాలు, కళల విభాగాల్లో విద్యార్థుల నమోదు పదేళ్లలో 15.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గింది. ఓఈసీ డీ సభ్య దేశాల్లో కూడా 80 శాతం దేశాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. బ్రిటన్‌లో 4,000కు పైగా కోర్సులను నిలిపివేయగా, నాటింగ్ హమ్ విశ్వవిద్యాలయం 40కిపైగా కోర్సులను నిలిపేసింది.
లీచెస్టర్ విశ్వవిద్యాలయం ఫిల్మ్ స్టడీస్, ఆధునిక భాషల విభాగాలను మూసివేసింది. అయితే డెలాయిట్ 2026 నివేదిక ప్రకారం.. ఏఐ విస్తరణతో విమర్శనాత్మక ఆలోచన, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, విశ్లేషణాత్మక దృక్పథం వంటి నైపుణ్యాల ప్రాధాన్యం పెరగడంతో సామాజిక శాస్త్రాలకు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ మోడల్ అవసరం
సింగపూర్ ‘స్కిల్స్ ఫ్యూచర్’ విధానం ద్వారా జీవితాంతం నేర్చుకునే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 2027 నుంచి విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్‌లలో చేరే ప్రతి విద్యార్థికీ ఏఐ ప్రాథమిక విద్య తప్పనిసరి కానుంది. దక్షిణ కొరియా 2027 నాటికి విశ్వవిద్యాలయాల్లో 30 శాతం కోర్సుల్లో ఏఐని అనుసంధానం చేయడానికి నిధులు కేటాయించింది. జపాన్ ‘సొసైటీ 5.0’ విధానంలో ఏఐతో పాటు సామాజిక శాస్త్రాలను మేళవిస్తూ హైబ్రిడ్ లెర్నింగ్, డిజిటల్ సోషల్ సైన్సెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.
వియత్నాం, ఇండోనేషియా దేశాలు చైనా విధానాన్ని పరిశీలిస్తున్నప్పటికీ, కోర్సులను పెద్దఎత్తున రద్దు చేసే దిశగా మాత్రం అడుగులు వేయలేదు. భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.1.39 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో ఉన్నత విద్యకు రూ.55,700 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. అలాగే మూడో తరగతి నుంచే ఏఐ విద్యను తప్పనిసరి చేసే దిశగా చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల ఉపాధి సామర్థ్యం 42.5 శాతం ఉండగా, తెలంగాణలో అది 47.5 శాతంగా ఉంది.
సాంకేతికేతర కోర్సుల్లో ఇది 51 శాతానికి మించి నమోదైంది. టీజీ ఎప్‌సెట్-2025లో కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సుల్లో 91 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో 12 వేలకుపైగా ఏఐ/ఎంఎల్ సీట్లు, 26 వేలకుపైగా సీఎస్‌ఈ సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం డీకిన్ విశ్వవిద్యాలయంతో కలిసి ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ‘కోడ్ మిత్ర’ కార్యక్రమం ద్వారా 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సుమారు 20 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ పరిజ్ఞానం అందిస్తోంది.
అలాగే పది జిల్లా కేంద్రాల్లో ఏఐ, నైపుణ్యాధారిత మైనారిటీ కళాశాలలను ప్రారంభించే ప్రణాళికను రూపొందించింది. అయితే ఇవి ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టులుగానే కొనసాగుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్-2025 ప్రకారం పది మంది యజమానుల్లో ఏడుగురు విశ్లేషణాత్మక ఆలోచనను అత్యంత కీలక నైపుణ్యంగా గుర్తించారు. సృజనాత్మక ఆలోచన నాలుగో స్థానంలో ఉండగా, నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కూడా అత్యంత అవసరమైన నైపుణ్యాలుగా పేర్కొన్నారు.
జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయం, రస్సెల్ గ్రూప్ అధ్యయనాల ప్రకారం అనేక సామాజిక శాస్త్రాల పట్టభద్రులు ఎస్‌టీఈఎం విద్యార్థులతో సమానంగా లేదా అంతకంటే మెరుగైన ఉపాధి అవకాశాలు, ఆదాయాన్ని సాధిస్తున్నారు. అందుకే భారతదేశం ఏఐ కోసం సోషల్ సైన్సెస్‌ను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి డిగ్రీ కోర్సులో ఏఐని సమగ్రంగా అనుసంధానం చేయడంతో పాటు, సామాజిక శాస్త్రాలను మరింత బలోపేతం చేయాలి.
జాతీయ విద్యా విధానం ద్వారా డిజిటల్ సోషల్ సైన్సెస్, సిస్టమ్స్ థింకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. చైనా మాదిరిగా కోర్సులను భారీగా రద్దు చేయడం కంటే సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తెలంగాణ అనుసరిస్తున్న సమతుల్య విధానం భారత్‌కు మరింత అనుకూలం. అలా చేస్తే ఏఐ నైపుణ్యాలతో పాటు మానవీయ విలువలు కలిగిన యువతను తీర్చిదిద్దుతూ వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని మరింత వేగంగా సాధించవచ్చు.

మంచాల కిరణ్‌కుమార్(పీహెచ్‌డీ),
యూజీసీ నెట్-ఎస్‌ఆర్‌ఎఫ్ స్కాలర్,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
ఓయూ






