14 July, 2026 | 4:11 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వల్లే సింగరేణికి నష్టాలు పీల్చుకు తిన్నాయి!

14-07-2026 01:41 AM
  1. నాడు సిద్దిపేటకు.. నేడు కొడంగల్‌కు సింగరేణి నిధులు 
  2. సంస్థను వేల కోట్లకు అమ్ముకున్న కేసీఆర్
  3. ఆనాడు సంస్థ నష్టాలపై కేసీఆర్, కేటీఆర్ మౌనం 
  4. నేడు అవినీతి జరిగిందంటూ లేఖలు రాయడం విడ్డూరం 
  5. సంస్థ సమస్యల పరిష్కారానికి కేంద్రం కృషి
  6. వేలం పాట లేకుండా తాడిచర్ల-2ను అప్పగించాం
  7. సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  8. కొత్తగూడెం, భూపాలపల్లిలో పర్యటన
  9. పాలన చేతకాక కేంద్రంపై నిందలు
  10. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  11. కార్మికులకు తీవ్ర ద్రోహం: ఎంపీ డీకే అరుణ

* బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోతుంటే సీఎంగా కేసీఆర్ మౌనంగా ఉన్నడు. సంస్థను వేల కోట్లకు అమ్ముకున్నడు. కాంగ్రెస్ వచ్చాక కూడా సంస్థ పరిధిలో ౨.౬౧ లక్షల కోట్ల కుంభకోణం జరిగింది.

 కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/భూపాలపల్లి, జూలై 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో సింగరేణి నష్టాల బాటకు గతంలో పాలించిన బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిపి సుమారు రూ.51 వేల కోట్ల బకాయిలను సింగరేణిపై మోపడంతో సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు.

ఉద్యోగుల జీతాల కోసం కూడా బ్యాంకుల వద్ద అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా సోమవారం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా, భూపాపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. సింగరేణి సంస్థను మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్లకు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఆనా డు సింగరేణి సంస్థ నష్టాలభారిలో పడుతుంటే మౌనం వహించిన కేటీఆర్, కేసీఆర్.. నేడు సింగరేణిలో అవినీతి జరిగిందంటూ తనకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

బీఆర్‌ఎస్ హ యాంలో ఎప్పుడైనా సింగరేణి సమస్యలపై కేంద్రా న్ని భాగస్వాములు చేశారా అంటూ ప్రశ్నించారు. సింగరేణి నిధులు ఆనాడు సిద్దిపేటకు పోతే, నేడు కొడంగల్ కు తరలిపోతున్నాయని ధ్వజమెత్తారు. చెమటను రక్తం గా మార్చే దేశానికే రాష్ట్రానికి వెలుగులు వెదజల్లుతున్న కార్మికుల ఆస్తిని ఆ రెండు ప్రభుత్వాలు కొల్లగొట్టాయని మండిపడ్డారు. 

2.61 లక్షల కోట్ల కుంభకోణం 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు నచ్చిన వారికి కట్టబెట్టడం ద్వారా సింగరేణి సంస్థకు రూ.2.61 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు అప్పటి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి బొగ్గు బావులను టెండర్లను రద్దు చేసిందని, అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు గుర్తు చేశారు. ఆనాడే టెండర్లు లేకుండా బొగ్గు బావులను ఎవరికీ కేటాయించవద్దని తీర్పు చెప్పిందన్నారు.

అయినప్పటికీ రాష్ట్రంలో సింగరేణి సంస్థ మనుగడ దెబ్బతింటుందని, కార్మికులు కష్టకాలంలో ఉన్నారని భావించిన కేంద్ర ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా, టెండర్లు నిర్వహించ కుండా దేశంలోనే మొట్టమొదటి సారిగా తాడిచర్ల ఒక్కో బావని సింగరేణి సంస్థకు అప్పగిం చినట్లు స్పష్టం చేశారు. తాడిచర్ల 2 బొగ్గు బావిలో గ్రేడ్ 8 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తుందని వేలాది మందికి ఉపాధి కలుగుతందన్నారు. 

అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటీ

10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి అడ్డుపెట్టుకొని రాజకీయం చేసి సింగరేణి సంస్థను బ్రష్టు పట్టించిందన్నారు. కేవలం ఓటు బ్యాంకు గానే సంస్థను చూసిందన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానంలో అవినీతిని కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు.

ఆయా సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పటేల్ మహేశ్వర్‌రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, అంజిరెడ్డి, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, రామారావు పటేల్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి, సత్యపాల్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్, ధర్మారావు, నాయకులు చల్లా నారాయణరెడ్డి, చందుపట్ల సునీల్ రెడ్డి, పుల్లారావు, పాపన్న, ఎరుకల గణపతి తదితరులు పాల్గొన్నారు.

ఆచరణలో సాధ్యం కానీ హామీలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీ లు గుప్పించి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ కాలం గడుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నిప్పులు చెరిగారు. సింగరేణి కార్మికులు  తమ రక్తాన్ని ధారపోసి విద్యుత్ వెలుగులు తెస్తుంటే ఆ నిధులతో ఫుట్బాల్ క్రీడలకు వెచ్చించడాన్ని ఆయన తప్పుపట్టారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించటం లేదని, అభివృద్ధికి కాళ్లు అడ్డు పెడుతున్నారంటూ ఆరోపించడానికి ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ‘గతంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అవినీతితో నష్టాల్లోకి నెట్టాయి. కార్మికుల రక్తస్వేదంతో నడిచే తెలంగాణ ఆణిముత్యాన్ని ఆ రెండు పార్టీలు తమ స్వార్థానికి వాడుకున్నాయి తప్ప, సంస్థ అభివృద్ధిని ఎప్పుడూ పట్టించుకోలేదు’ అన్నారు. 

అప్పుల కూపంలోకి నెట్టారు: డీకే అరుణ

గత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు సింగరేణిని 54 వేల కోట్ల రూపాయల అప్పుల కూపంలోకి నెట్టి మన కార్మికులకు తీవ్ర ద్రోహం చేశాయని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ‘కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సింగరేణికి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం’ అని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.