14 July, 2026 | 4:11 AM

రాజకీయాల్లో కాళేశ్వరం మునక!

14-07-2026 01:33 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల వార్‌కు అసెంబ్లీ వేదిక అయ్యేనా!

సంగారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి వరద జలాలను వాడుకోవడ ంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్, గత పాలకుల పాపాల వల్లే ప్రాజెక్టులు కుంగిపోయాయంటూ అధికార కాంగ్రెస్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హై టెన్షన్‌కు దారితీశాయి.

గత కొన్ని రోజులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్వహణపై ఇరు పార్టీల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ‘ప్రస్తుతం గోదావరిలో వస్తున్న వరద నీటిని ఎల్లంపల్లి, ఇతర రిజర్వాయర్లకు తరలించడంలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోంది. మూడు నెలల పాటు ఇరిగేష న్ శాఖ బాధ్యతలను నాకు అప్పగించండి.

పంపులు ఎలా నడపాలో, నీళ్లు ఎలా నింపాలో నేను చేసి చూపిస్తా.. ఒకవేళ నేను నీళ్లు నింపలేకపోతే నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మరి చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా?‘ అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు విసిరిన సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బీఆర్‌ఎస్‌కు అలవా టుగా మారిందని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి గల సాంకేతిక లోపాలపై పారిపోయేదిలేదని స్పష్టంచేశారు. ‘ధైర్యముంటే అసెం బ్లీలో చర్చకు రావాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం స మర్పించడంతో పాటు సుదీర్ఘ చర్చకు మేం సిద్ధం.. కేసీఆర్, హరీష్ రావు సభకు వచ్చి సమాధానం చెప్పాలి.. రాష్ట్ర ప్రజల ముందే ఎవరి తప్పు ఏంటో తేల్చేస్తాం‘ అని సీఎం ఎదురుదాడికి దిగారు. 

హీటెక్కిన క్యాడర్..

ఈ ఇద్దరు అగ్రనేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు బీఆర్‌ఎస్ క్యాడర్ సామాజిక మాధ్యమాల్లో డిబేట్లతో హోరెత్తిస్తున్నారు. ఒకవైపు వర్షాలు లేక రైతాంగం ఆందోళన చెందుతుంటే, మరోవైపు ప్రా జెక్టుల నీటి నిర్వహణపై జరుగుతున్న ఈ హై డ్రా మా అసెంబ్లీ ముట్టడి లేదా సభ లోపల జరిగే చ ర్చల్లో ఎలాంటి ఊహించని మలుపులు తిరుగుతుందోనని యావత్ రాష్ట్రం ఆసక్తిగా గమని స్తోంది.

మెతుకు సీమ గోస..

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, బరాజ్‌ల వైఫల్యం మరియు దాని చుట్టూ నడుస్తున్న రాజకీయ యుద్ధం ఉమ్మడి మెదక్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో ఇటు పొలిటికల్ హీట్, అటు సాగునీటి కొరత రెండూ ఇక్కడే పతాక స్థాయికి చేరాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి.

మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద గోదావరి జలాలను లిఫ్ట్ చేయకపోవడంతో ఈ భారీ రిజర్వా యర్లలోకి కొత్త నీరు చేరడం లేదు. గతంలో ఈ రిజర్వాయర్ల ద్వారా గజ్వేల్, సిద్దిపేట, దూబ్బాక, జనగామ నియోజకవర్గాలకు అందినట్లుగా ఇప్పు డు సాగునీరు అందడం లేదు. ఫలితంగా వానాకాలం సీజన్లో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. 

హల్దీ వాగు, మంజీరా పరివాహక ప్రాంతాల గోస..

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాలను కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ వాగులోకి, అక్కడ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేశారు. ప్రస్తుత క్రెడిట్ పాలిటిక్స్, టెక్నికల్ నిపుణుల ఆంక్షల వల్ల హల్దీ వాగులోకి నీటి విడుదల నిలిచిపోయింది. హల్దీ వాగుపై ఆధారపడిన మెదక్, పాపన్నపేట పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయా యి. చెరువులు అడుగంటడంతో రైతులు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.

బీఆర్‌ఎస్‌కు బలమైన కోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య సవాల్-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. గజ్వేల్ (కేసీఆర్ సిట్టింగ్ స్థానం), సిద్దిపేట (హరీష్ రావు స్థానం) లలో కాళేశ్వరం నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ గులాబీ శ్రేణులు గ్రా మాల్లోకి వెళ్తున్నాయి.

మరోవైపు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ భూసేకరణలో జరిగిన అక్రమాలు, ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరిట మెదక్ జిల్లా ప్రజలకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. ఏదిఏమైనా ఒ కప్పుడు కాళేశ్వరం జలాలతో జలకళను సంతరించుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ పంతాల వల్ల మళ్లీ నీటి ఎద్దడి నీడన కొట్టుమిట్టాడుతోంది.

తెరపైకి ఎన్డీఎస్‌ఏ..

ఈ రాజకీయ యుద్ధానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు మరింత ఆజ్యం పోశాయి. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు, తాత్కాలిక రక్షణ చర్యలపై ఇరు వర్గాలూ తమకు అనుకూలమైన కోణంలో వాదనలు వినిపిస్తున్నాయి. బరా జ్‌లు బలహీనపడ్డాయని కాంగ్రెస్ అంటుంటే, కావాలనే ప్రాజెక్టును నిర్వీర్యం చేసి కేసీఆర్‌కు చెడ్డపేరు తేవాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపి స్తోంది. ఈ సాంకేతిక లీకేజీల అంశం కాస్తా ఇప్పు డు ’క్రెడిట్ వర్సెస్ బ్లేమ్’ పాలిటిక్స్‌గా రూపాంతరం చెందింది.

నాయకుల సవాళ్లు ఎలా ఉన్నా, క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వర్షాలు సకాలంలో పడక, ఇటు ప్రాజెక్టుల నుంచి నీటిని లిఫ్ట్ చేయకపోవడంతో ఈసారి పంటల పరిస్థితి ఏంటనే ప్రశ్నార్థకం నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారులు సైతం ఇటు ప్రభుత్వ ఆదేశాలు, అటు ప్రతిపక్షాల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి కీలక జలాశయాల్లో నీటి నిల్వలను పెంచకపోతే రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అసలు చిక్కు ఎక్కడ?

కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ పర్యవేక్షణలో ప్రాజెక్టు పునరుద్ధరణకు కసరత్తు జరుగుతోంది. ఆగస్టు చివరి నాటికి తుది నివేదికలు రానున్నాయి. అంతవరకు బ్యారేజీల భద్రత దృష్ట్యా గేట్లు ఎత్తి ఉంచాలని, నీటిని నింపకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.