1 June, 2026 | 2:08 AM

తెలంగాణ నేలపై ‘బంగారు’ మామిడి

01-06-2026 01:21 AM

మొయినాబాద్‌లో కిలో రూ. 2.70 లక్షల ‘మియాజకి’ సాగు!

మొయినాబాద్, మే 30(విజయక్రాంతి): మామిడి పండ్లలో రారాజుగా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకంగా పేరుగాంచిన జపాన్ దేశపు ‘మియాజకి’ మామిడి పండ్లు ఇప్పుడు మన తెలంగాణ నేలపై సందడి చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మతీన్ ముజద్దది ఫామ్‌హౌస్‌లో ఈ అరుదైన మామిడి రకం విజయవంతంగా సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పండ్ల ధర కిలోకు సుమారు రూ. 2.70 లక్షల వరకు పలుకుతుందని ఫామ్‌హౌస్ యజమాని మతీన్ వెల్లడించారు.

పదేళ్ల శ్రమ.. అరుదైన ఫలితం  

దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదుగా కనిపించే ఈ మియాజకి రకం మామిడి తెలంగాణ వాతావరణంలో పండడంపై మతీన్ హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఉన్న మక్కువతో ఈ అరుదైన మొక్కను సాగు చేసినట్లు ఆయన తెలిపారు.

‘సుమారు పదేళ్ల క్రితం మా సోదరుడు ఈ అరుదైన మొక్కను నాకు బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ, నిరంతర సంరక్షణతో దీనిని పెంచుతున్నాం. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే పండే ఈ చెట్టు, ఇప్పుడు అద్భుతమైన దిగుబడిని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది’.

మతీన్ ముజద్దది, 

ఫామ్‌హౌస్ యజమాని

‘మియాజకి’ ప్రత్యేకతలు ఇవే.. ఆకర్షణీయమైన రంగు 

సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా ఇవి ముదురు ఎరుపు (రూబీ రెడ్) రంగులో ఉండి కంటికి ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని జపాన్‌లో ‘ఎగ్ ఆఫ్ ది సన్’ అని కూడా పిలుస్తారు.

అధిక తీపి, పోషకాలు: ఈ పండ్లలో చక్కెర శాతం (15% పైగా) ఎక్కువగా ఉండి, అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేక సంరక్షణ.. ఈ రకం సాగుకు సాధారణ మామిడి కంటే ఎక్కువ శ్రమ, పక్షుల నుంచి రక్షణకు ప్రత్యేకమైన నెట్ కవరింగ్ వంటి జాగ్రత్తలు అవసరమవుతాయి.

ప్రభుత్వ ప్రశంసలు.. స్థానిక రైతుల ఆసక్తి

ప్రకృతి సంరక్షణ, వృక్షారోపణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తన ఫామ్‌హౌస్‌లో అనేక అరుదైన జాతుల చెట్లను పెంచుతున్నందుకు మతీన్ గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు. మొయినాబాద్ లాంటి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘మియాజకి’ మామిడి పండటం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, వ్యవసాయ రంగంలో కొత్త ప్రయోగాలు చేయాలనుకునే రైతులకు ఈ సాగు ఒక గొప్ప ఉదాహరణగా, స్ఫూర్తిగా నిలుస్తుందని స్థానిక రైతులు అభిప్రాయ పడుతున్నారు.