ఒపెక్‌తో యూఏఈ కటీఫ్
యూఏఈ తన దారి తాను ఎంచుకుంది. ఒపెక్‌తో ఉన్న ఆరు దశాబ్దాల బంధాన్ని ఆ దేశం తెగదెంపులు చేసుకుంది. ఒపెక్‌తోపాటు ఒపెక్ ప్లస్ నుంచి కూడా నిష్క్రమించిన యూఏఈ చమురు ఉత్పత్తి దేశాల కూటమికి గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు దేశమైన యూఏఈ బయటకు వెళ్లడం ద్వారా సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒపెక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.
ఇరాన్ యుద్ధ పరిణామాలు, గల్ఫ్ దేశాలతో, ముఖ్యంగా సౌదీ అరేబియాతో సంబంధాలు దెబ్బతినడం, చమురు ఉత్పత్తి విషయంలో ఒపెక్ విధిస్తున్న ఆంక్షలు యూఏఈ ఈ కఠిన నిర్ణయం తీసుకునేందుకు పురిగొల్పాయని చెప్పవచ్చు. ఈ నిష్క్రమణ నిర్ణయం మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని యూఏఈ ఇంధన శాఖ మంత్రి సుహైల్ మొహమ్మద్ ప్రకటించడం గమనార్హం.
ఒపెక్ నుంచి యూఏఈ ఆకస్మిక నిష్క్రమణతో తాత్కాలికంగా ప్రపంచ చమురు మార్కెట్‌లో ఒడుదొడుకులు ఎదురైనా, దీర్ఘకాలికంగా మాత్రం ప్రపంచ దేశాలకు లబ్ధిచేకూరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల భారత్ ఎక్కువ లబ్ధిపొందే అవకాశం ఉంది. ఇకపై ఒపెక్‌తో సంబంధం లేకుండా యూఏఈ తన సామర్థ్యం మేరకు చమురును ఉత్పత్తి చేసుకునే వెలుసుబాటు లభిస్తుంది. యూఏఈ తన సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తే మార్కెట్లోకి చమురు వరదలా పారుతుంది.
మరోవైపు ముడిచమురు ధరలు కూడా అదుపులోకి వస్తాయి. కాగా, ప్రస్తుతం భారత్ చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా పది శాతం వరకు ఉంది. యూఏఈ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయంతో 85 చమురు దిగుమతులపైనే ఆధారపడే భారత్ ఎక్కువగా లాభపడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూఏఈ నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తే హోర్ముజ్ జలసంధిని దాటాల్సిన అవసరం లేకపోవడం భారత్‌కు మరో ప్రయోజనం.
యూఏఈ తన చమురు ఉత్ప త్తులను ఎగుమతి చేసేందుకు హబ్షాన్ టెర్మినల్ నుంచి ఫుజైరా నౌకాశ్రయం వరకు భారీ ఆయిల్ పైప్‌లైన్‌ను నిర్మించింది. ఈ పైప్‌లైన్ ద్వారా యూఏఈ చమురు నిక్షేపాల నుంచి నేరుగా ఫుజైరా నౌకాశ్రయానికి, అక్కడి నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా భారత్‌కు చమురును సులువుగా తరలించే ఆస్కారం ఉంటుంది. తద్వారా భారత్‌కు ఇంధన సమస్య తీరడంతో, ధరలూ అదుపులోకి వస్తాయి.






