30 April, 2026 | 1:23 AM

పరిషత్ ఓటర్ల లెక్క తేలింది

30-04-2026 12:27 AM
  1. మొత్తం 5,23,327 మంది ఓటర్లు పెరిగిన ఓటర్లు 3112
  2. త్వరలో నిర్వహణకు సన్నాహాలు
  3. కోర్టు గైడ్లైన్స్ ప్రకారమే రిజర్వేషన్లు
  4. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు

మెదక్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి) : ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ లోనే ఓటరు జాబితాను ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ చేసినా, బీసీ రిజర్వేషన్ల  కోర్టు తీర్పుతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నదమవుతుంది. గతంలో ఉన్న ఓటర్లతో పాటు తాజాగా వచ్చిన ఓటర్లతో కలుపుకొని  ముసాయిదా జాబితాను జిల్లా యంత్రాంగం సిద్దం చేస్తుంది. 

 పెరిగిన ఓటర్లు 3112

మెదక్ జిల్లాలో 21జడ్పీటీసీ, 21ఎంపీపీ లు, 190 ఎంపీటీసీ లు ఉన్నారు. అయితే మొత్తం ఓటర్లు 5,23,327 మంది ఉన్నారు. ఈ సారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. మొన్నటి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కటాఫ్ తేదీని 10 జూలై 2025గా ప్రకటించారు. అప్పటి వరకు ఓటర్గా నమోదు చేసుకున్న వారందరికీ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం కలిసి వచ్చినందున కటాఫ్ తేదీని 05 ఫిబ్రవరి 2026 నాటికి పరిగణలోకి తీసుకున్నారు.

కటాఫ్ తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పెరిగిన ఓటర్లను జాబితాలో చేర్చే పనుల్లో ప్రస్తుతం సిబ్బంది బిజీగా ఉన్నారు. దాదాపు ఏడు నెలల సమయం అదనంగా కలిసి రావడంతో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు సైతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దీంతో 3112 ఓటర్లు పెరిగారు.

రిజర్వేషన్లలో మార్పులు

ఎంపీటీసీ మొదలుకొని జడ్పీ చైర్మన్ స్థానం వరకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లలో మార్పులు చేర్పులు కోర్టు గైడ్ లైన్స్పైనే ఆధారపడనున్నాయి. రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే పూర్తయినందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుండగా, అన్ని వర్గాలకు మొత్తం 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉంది. గత పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లోనూ ఎన్నికల కమిషన్ ఇదే నిబంధనను అమలు చేయగా, పార్టీ పరంగా కాంగ్రెస్ వివిధ కేటగరీలకు రిజర్వేషన్లు అమలు చేసింది.

ఇందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి అవలంభిస్తుందా...? లేదా నిబంధనల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందా...? అన్న విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ పార్టీ నిర్ణయం మేరకు మొన్నటి ఎన్నికల మాదిరిగా 42 అమలు చేస్తే బీసీలకు పెద్దపీట వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రిజర్వేషన్లు అనుకూలించిన చోట బీసీ సామాజిక వర్గాల కు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించనుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదే ళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసేలా చట్ట సవరణ తిరిగి చేపట్టడంతో పాటు పార్టీ పరంగా అవకాశం కల్పిస్తే ఆశావహులు పోటీ చేసేందుకు సన్నద్ధం అవు తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించగా, సాంఘీక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా 42శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం.. జిల్లాలోని ఎంపీటీసీ జడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మరో మారు రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా, అంతే మొత్తంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీ, 21 ఎంపీపీ స్థానాలున్నాయి. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియలో అధికంగా బీసీలకు కేటాయించడంతో జనరల్ స్థానాలు తగ్గాయి. 

కానీ రిజర్వేషన్ల మార్పులో బీసీ రిజర్వుడ్ సీట్లు తగ్గించి 50 శాతం లోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండేలా మళ్లీ నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన 50 శాతం జనరల్కు కేటాయించడం ద్వారా జనరల్ స్థానాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే అవకాశం లభించనుంది. ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని 50 శాతం రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తూ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.

గడువు ముగిసి 22 నెలలు

మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాలకు గడువు ముగిసి 22 నెలలకు పైగా అయ్యింది. జిల్లాలో 2019  మే నెలలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ సంవత్సరం జూన్ 4 న ఫలితాలు విడుదల అయ్యాయి. కొలువుదీరిన పాలక వర్గం గడువు 2024 జూన్ తో ముగిసింది.