30 April, 2026 | 1:28 AM

జనగణనలో కులగణన చారిత్రక అవసరం!

30-04-2026 12:00 AM

జనగణనలో కులగణన అనేది నేడు చారిత్రక అవసరం! ఈ చారిత్రక అవసరాన్ని కేంద్రం విస్మరించి జనగణనకే పరిమితమైతే నిష్ప్రయోజనమే! ఏదైనా ప్రయోజనం జరగాలంటే దేశంలో బాధితులు ఎవరో తెలిసేది ఎట్లాగ? వైద్యుడి వద్దకు ఒక రోగి వెళ్లినప్పుడు, రోగ నిర్ధారణ కోసం ఆ వైద్యుడు రోగిని వైద్యపరీక్షలు చేయించుకోవాలని అంటాడు. ఎక్స్-రే కోసం పంపుతాడు.

రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారంగా రోగికి వైద్యుడు వైద్యం చేస్తాడు. అలాగే ఈ దేశంలో కుల వ్యవస్థ, కుల వివక్ష వల్ల  వృత్తులు కోల్పోయిన కుటుంబాల సంపూర్ణ నష్టం తెలియాలంటే, సామాజిక సముహాల సంపూర్ణ ఎక్స్-రే రిపోర్ట్‌ను కేంద్రం సేకరించాలి. అందుకే ఈ దేశంలో జనగణనలో కులగణన సర్వే కూడా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ దేశంలో ఎవరు, ఏ రంగంలో వెనకబడ్డారనే సంపూర్ణ లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తాయి.

కులగణన చేయాలని అనేక సంఘాలు గొంతెత్తి నినదిస్తున్నది ఫ్యాషన్ కోసం కాదు. ఈ దేశంలో వందల వేల కులాలు ఉన్నాయి, ఒక్కో వర్గానిది ఒక్కో సమస్య. ఈ దేశంలో చేసే పని వల్ల వర్గాలు, వృత్తులు, కులాలు ఏర్పడ్డాయి. వారి స్థితిగతులు వంద సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేవు. అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక కులాలు, వృత్తులు, సమూహాలు, సమాజాలు ఒడుదొడుకులకు లోనయ్యాయి.

గత వంద సంవత్సరాలుగా బారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక పరిస్థితులు వేగవంతంగా మారాయి. వంద సంవత్సరాల క్రితం ఈ దేశంలో వర్ధిల్లిన చేనేత పంచకుల వృత్తులు... కుమ్మరి, గీత పూసల వడ్డెర, చర్మకారులు, సంచార కులాలు సాంస్కృతిక వృత్తులవారు అనేకులు తమ వృత్తులను కోల్పోయారు. కొన్ని పురాతన వృత్తులు కనుమరుగయ్యాయి.

కేంద్రం దేశంలో చేపడుతున్న జనగణన వల్ల ఏదైనా న్యాయం జరగాలంటే కులగణన అవసరం. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను పనిచేసిన చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో వారం రోజుల పాటు సమగ్ర సర్వే నిర్వహించాం. ఒక మండలాన్ని యూనిట్‌గా తీసుకొని, ఆ మండలంలోని ప్రతి గ్రామంలో కుల వృత్తిదారుల వారీగా సమగ్రమైన సర్వే చేశాం.

ఈ సర్వేలో వృత్తి కులాల వారి వెనుకబాటుతనం, సంచార కులాల దయనీయ పరిస్థితులు, సాంస్కృతిక కులాల పేదరికం, ఆదరణ లేకపోవడం, వృత్తులను కోల్పోయినవారు వలసజీవులుగా మారిన తీరు చెప్పనలవి కానిది. శిథిలమైన పాత ఇండ్లు అన్నీ వడ్ల కమ్మరి చేనేత వారివే. చేస్తున్న వృత్తుల స్థానంలో ప్రత్యామ్నాయ వృత్తులోకి వెళ్లినవారు అనేకులు. ముఖ్యంగా అటో, లారీ డ్రైవర్లుగా, పట్టణ ప్రాంతాల్లో కూలీలుగా, వాచ్‌మెన్‌లుగా చాలా మంది మారారు. అప్పటికీ, ఇప్పటికీ దేశంలో అనేక విప్లవాత్మకమైన సామాజిక మార్పులు వచ్చాయి.

దీనికి ప్రధాన కారణం దేశంలో ప్రజలందరి స్థితిగతులు ఒకేలా లేకపోవడమే. జనగణనలో కులగణన చేపట్టడం వల్ల కేంద్రానికి ప్రజల, కుల సముహాల సంపూర్ణ డేటా చేరువవుతుంది. ఈ డేటా ఆధారంగా ఏయే సామాజిక వర్గాలు వెనుకబడినవి, వారి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులు తెలుస్తాయి. అంతేకాదు, వారి మెరుగైన జీవనానికి జనగణనలో కులగణన సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా ప్రయాణం చేస్తుందని ఆశిస్తున్నాం. 

అంబాల నారాయణగౌడ్,

గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు