డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
- వాహనాల తనిఖీలో అదుపులోకి తీసుకున్ననాగోల్ పోలీసులు
- వివరాలు వెల్లడించిన ఎల్బీనగర్ డీసీపీ అనురాధ
ఎల్బీనగర్, ఏప్రిల్ 2 : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి ఎస్‌ఓటి, నాగోల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 25.65 గ్రాముల ఎండీ ఎంఏ డ్రగ్స్, 3 మొబైల్స్, రెండు హోండా యాక్టివాలు, స్మాల్ వేయింగ్ మిషన్ సుమారు రూ. 3,61,990 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు డ్రగ్స్ కు బానిసై ఈజీ మనీ కోసం ఇతరులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు.
గురువారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ అనురాధ కేసు వివరాలను వెల్లడించారు. మోహదీపట్నం పరిధిలోని టోలిచౌకిలో నివాసం ఉంటున్న జునైద్ రజా సిద్ధిఖీ(36) యూఎస్ ఐటీ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. రాజేంద్ర నగర్‌లోని బండ్లగూడ సన్ సిటీలో నివాసం ఉంటున్నసునీల్ సుబ్బా అలియాస్ జానీ(29) బార్ టెండర్, చెఫ్‌గా పని చేస్తున్నాడు. ఇతని స్వస్థలం కలకత్తా. కాగా, విరిద్దరూ స్నేహితులు.
గతంలో బండ్లగూడలోని సన్ సిటీలో ఒక రెస్టారెంట్‌ను నడిపేవారు. అదే ప్రాంతంలో నివసించే మహ్మద్ అన్సారీ అనే వ్యక్తికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. అతను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి, రాజు అనే వ్యక్తి ద్వారా రాజా సిద్ధిఖీ, సునీల్ సుబ్బా కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదించేవారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 1న సాయంత్రం ప్రాంతంలో నాగోల్ ఎక్స్ రోడ్ వద్ద హోండా యాక్టివా వాహనాలపై (టీఎస్08ఈఎల్3973, టీఎస్07ఈవీ6557) వస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్, మొబైల్స్, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు మహ్మద్ అన్సారీ, రాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ అనురాధ వివరించారు.




