17 August, 2026 | 10:47 PM

హత్య కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు

17-08-2026 09:31 PM

నిందితురాలు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

మేడిపల్లి, ఆగస్టు 17 (విజయక్రాంతి): భర్త హత్య కేసును మేడిపల్లి పోలీసులు సమర్థవంతంగా ఛేదించారు. భర్తను కిరాతకంగా హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన నిందితురాలు సునీతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పీర్జాదిగూడలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51) ఈ నెల 6న మధ్యాహ్నం 12:00 గంటలకు నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు.

నిందితురాలు, అతని భార్య సునీత (44) కూడా పని ముగించుకుని మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంటికి చేరుకుంది. అనంతరం సత్యనారాయణ మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను తీవ్రంగా దూషిస్తూ, మానసికంగా వేధించాడు.భర్త ప్రవర్తన, వేధింపులతో తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత, అతడిని హత్య చేయాలని పథకం పన్నింది. మృతుడు మద్యం మత్తులో ఉన్న సమయంలో అతని కాళ్లు, చేతులను చీరతో కట్టేసింది. అనంతరం సెంట్రింగ్ కర్రతో సత్యనారాయణ తలపై, శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసింది.

తీవ్ర గాయాలు కావడంతో అతడు స్పృహ కోల్పోయాడు. దాడి అనంతరం నిందితురాలు తన కుమారుడు నికిత్‌కు ఫోన్ చేసి, తండ్రి వాహనంపై నుంచి జారిపడి గాయపడ్డాడని అబద్ధం చెప్పింది. వెంటనే గాయపడిన సత్యనారాయణను బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా, రాత్రి 10:18 గంటల సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు సత్యనారాయణను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సందేహాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజ్, పోస్టుమార్టం నివేదిక, వైద్యుల అభిప్రాయాలను సేకరించారు. ప్రమాదం జరిగిన ఆధారాలు లేకపోవడంతో భార్య సునీతను తమదైన శైలిలో విచారించారు.

విచారణలో తనను, పిల్లలను భర్త మానసికంగా వేధిస్తున్నందునే కాళ్లు, చేతులు కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టి హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. నిందితురాలు ఇచ్చిన సమాచారంతో హత్యకు ఉపయోగించిన చీర, కర్రను పంచుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాక్ష్యాధారాల ఆధారంగా ముందుగా నమోదు చేసిన సెక్షన్ 106(1) బిఎన్ఎస్ ను హత్య కేెసుగా మార్చారు. నిందితురాలిపై సెక్షన్ 103(1), 238 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసి, ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.