21 July, 2026 | 4:52 PM

సహకారం అందేది ఎవరికో?

21-07-2026 10:28 AM

అనుభవజ్ఞులక లేక గాడ్ ఫాదర్ ఉన్నవారిక!!

బోథ్, జూలై 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించడంతో స్థానిక నాయకుల్లో అలజడి మొదలైంది. పదవిని దక్కించుకునేందుకు మండల కేంద్రానికి చెందిన పలువురు నాయకులు పావులు కదుపుతున్నారు. కొంతమంది నాయకులు తమకు ఉన్న పరిచయాలతో సహకార సంఘం చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న ఆత్రుతలో ఉన్నట్లు తెలిసింది. అయితే పైరవీల వ్యవహారం లో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీలో గ్రూపులు కట్టి పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పాత కొత్త నేతల ప్రయత్నాలు.. 

రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రస్తుతం ఉన్న ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ తనకున్న అనుభవంతో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఆయనతోపాటు మరో ముగ్గురు నాయకులు రేసులో ఉన్నట్లు సమాచారం. వారి వారి రాజకీయ గురువులతో పదవి కోసం పావులు కలుపుతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే సహకార సంఘం చైర్మన్ పదవి తమకంటే తమకే దక్కుతుందని నేతలు భరోసాలో ఉన్నారు. కొంతమంది నాయకులు పదవుల కోసం డబ్బును సైతం వారి వారి రాజకీయ గురువులకు ఇచ్చేందుకు వెనకాడడం లేదు. సహకార సంఘం చైర్మన్ పదవి చేజిక్కించుకుంటే డబ్బులు వాటంతట అదే వస్తాయన్న ధీమాలో ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించిన కొంత మంది నాయకులు డబ్బులు వారి రాజకీయ గురువులకు ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగుతున్నది. పదవి ఎవరిని వరిస్తుందో కానీ గ్రూపులు మాత్రం బలపడుతున్నాయి.. 

తెర ముందు ఒకటి తెరచాటు మరొకటి.... 

పదవి కోసం వారి వారి నాయకుల వద్దకు వెళుతున్న ఆశావాదులు ముందు తాను పదవిని ఆశించడం లేదంటూ పేర్కొంటూ తెర వెనుక పదవి తనకే కావాలని వారి రాజకీయ గురువులకు విన్నవించుకుంటున్నట్లు తెలిసింది .అయితేపదవిని ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని పైరవీళ్ల కోసం రావద్దు అంటూ నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది. రాజకీయ కురువృద్ధులు మాత్రం తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా సహకార సంఘం చైర్మన్ పదవి ప్రజలకు సహకారం అందించిన వారిగా లేక పైరవీకారులగా అనేది పార్టీలో చేర్చని అంశంగా మారింది.