తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర, మధ్య తెలంగాణలో(Telangana Rain) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department ) ప్రకటించింది. హైదరాబాద్‌లో కుండపోత వర్షం(Hyderabad Rain) కురవడంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీచేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ(GHMC), డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంగళవారం నాడు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముంది. హైదరాబాద్ నగరాన్ని తెల్లవారుజామునుంచే మబ్బులు కమ్మేశాయి.
ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో(Medak districts) పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మెదక్ 4.8, కుకునూర్ పల్లిలో 4.3 సెంటీ మీటర్ల వర్షపాతం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 4.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తాజా వాతావరణ సూచన ప్రకారం రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్(Mahabubnagar), నారాయణపేట, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉదయం పూట తేలికపాటి జల్లులు, ఆ తర్వాత మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం అవకాశం ఉన్నందున, రద్దీ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అధికారులు సూచించారు.






