బాధిత కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ
మంథని, జూలై 21(విజయక్రాంతి): మంథని మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండలంలోని గుమ్నూరు గ్రామానికి చెందిన మంథని సంపత్ కుటుంబంలో కుమారుడు, తండ్రి మృతిచెందిన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లిన మంత్రి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అలాగే సిద్ధపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పేయ్యల గట్టయ్య స్ట్రోక్‌తో మృతిచెందగా, అదే గ్రామానికి చెందిన మణికంఠ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో వారి కుటుంబాలను పరామర్శించి మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అనంతరం గుమ్నూరు గ్రామానికి చెందిన మోతే శంకర్ కుమారుడు అభిరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అభిరామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






