మహిళలకు గౌరవం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి
అడిషనల్ డీసీపీ కుషాల్కర్
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 30 : సమాజంలో ఆడ, మగ ఇద్దరూ సమానమేనని, మహిళలకు గౌరవం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అడిషనల్ డీసీపీ కుషాల్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, గృహ హింస నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కుషాల్కర్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్ హాజరై మాట్లాడారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళల రక్షణ కోసం ఉన్న వివిధ చట్టాల గురించి, ముఖ్యంగా గృహ హింస నిరోధక చట్టం, వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ల గురించి అవగాహన కల్పించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ’షీ టీమ్స్’ సేవలు మరియు డయల్ 100 వినియోగంపై సూచనలు చేశారు.
బాల్య వివాహాలు, సైబర్, వరకట్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భయం వీడి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో స్థానిక పోలీసు అధికారులు ఏసీపీ రవీందర్, వన్ టౌన్, టూ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, ఏబీ దుర్గ, న్యాయవాది రోహిణి, డిప్యూటీ డీఆర్డీవో సుధీర్ బాబు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.






