అంగన్వాడీ భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లాలో నిర్మాణంలో నిలిచిపోయిన అంగన్వాడీ భవనాల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ నిర్మాణ అవసరాలు ఉన్నాయో గుర్తించి, అక్కడ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అంగన్వాడీ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ అభివృద్ధి అధికారి చందర్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ప్రమీల, డి ఈ పి ఆర్ ఓ, సిడిపి ఓలు తదితరులు పాల్గొన్నారు.






