16 June, 2026 | 9:53 PM

గోమారంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ

16-06-2026 08:42 PM

శివంపేట్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని గోమారం గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు గోమారం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువ నాయకులు రామ్ చంద్ర రెడ్డి, చంద్ర పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇంచార్జి చంద్రశేఖర్, నియోజకవర్గ ఇంచార్జి గణేష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు అభిషేక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల తరపున ప్రశ్నించడం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పోరాడడమే తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోవడం ఆందోళనకరమని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.