ఐక్య పోరాటాలు నిర్వహించాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): కార్మికోద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే ఆశయాలకు అనుగుణంగా కార్మిక వర్గం, శ్రామిక ప్రజానీకం ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో అమరజీవి ఉద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే వర్థంతి సభ ఘనంగా నిర్వహించి బిటి రణదీవే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సిఐటియు వ్యవస్థాపకులు బిటి రణదీవే కార్మిక సంఘాలు స్థాపించి కార్మికులను సమీకరించి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు.ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేసిన అనేక పోరాటాల ద్వారా చట్టాలు వచ్చాయన్నారు. దేశంలో స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులకు హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు ఉదృతంగా నిర్వహించారని అన్నారు.
బి టి రణదీవే ఉద్యమ స్పూర్తి తో నేటి కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని అన్నారు.నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు గోపగాని లక్ష్మీ, నర్సయ్య,సిఐటియు నాయకులు కుంజా నాగమణి,కీసరి శ్రీలత,పాపమ్మ ,బుచ్చమ్మ,మంగ, తిరుపతమ్మ, కళ్యాణి, చంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.




