ఆదివాసీలు అభివృద్ధి చెందాలి
- అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
- గిరిజన సంక్షేమానికి 18,745.16 కోట్లు కేటాయింపు
- రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): అడవితో అనుబంధాన్ని, తమ మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారతతో పాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యం ఇస్తోందని తెలిపారు. గిరిజన బిడ్డలు దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో రాణించేలా అవకాశాలు కల్పించడ మే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాభవన్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి మాట్లాడారు.
గిరిజన సంక్షేమానికి ఎస్టీ ప్రత్యేక అభివృద్ది రూ.18,745.16 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులను గిరిజన ప్రాంతాల్లో విద్య, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్, సాగు-భూమి అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలకు వినియోగిస్తున్నామన్నారు. ఇందిరాగిరి జల వికాసం ద్వారా గిరిజన రైతుల భూములకు నీటివసతి కల్పించడంపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. సౌరశక్తి, సోలార్ పంపుల వినియోగాన్ని పెంచడంతో పాటు తోటలు, ప్రత్యామ్నాయ పంటలు, భూమి ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ -అడవి బంధం చెట్టు-మనిషి సంబంధం కాదు.. తల్లి-బిడ్డ అనుబంధం అని పేర్కొన్నారు.
అడవిని కాపాడుకుంటూనే అభివృ ద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన గురుకులాల్లోని 166 విద్యాసంస్థల్లో 83 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. గిరిజన ఆదివాసీల వీరుల చరిత్రను పుస్తకాలకే పరిమితం చేయకుండా భావితరాలకు తెలియజేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రానాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్, సెక్రటరీ సీతాలక్ష్మితదితరులు పాల్గొన్నారు.






